అతను డ్రైవర్‌.. ఆమె నర్సు.. కలిసి ఉండలేమని.. కారులోనే

14 Aug, 2021 12:47 IST|Sakshi

బెంగళూరు: అతను ఓ డ్రైవర్.. ఆమె నర్స్.. వారిద్దరికీ కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. ఆ పరిచయం కాస్త  ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా బంధం బలపడింది.  పెళ్లి చేసుకోవాలని భావించారు. కలిసి ఉండాలని కలలు కన్నారు. ఈ విషయాన్ని ముందుగా పెద్దలకు చెప్పారు. కానీ వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. పెళ్లి చేసేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ జంట తీవ్ర నిర్ణయం తీసుకుంది. బతికి ఉండగా కలిసి ఉండలేమని బాధతో.. మరణంలోనైనా ఒక్కటి కావాలని భావించారు. ఇద్దరూ కారులో నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లా కినకహళ్లిలో చోటుచేసుకుంది.

శుక్రవారం సాయంత్రం గ్రామంలోని చెరువు వద్దకు చేరుకున్న ప్రేమికులు కొంతసేపు మాట్లాడుకున్నారు. అనంతరం కారు లోపల ఉండి.. కారుకు నిప్పటించుకుని మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు..మాంబళ్లికి గ్రామానికి చెందిన కాంచన (20), శ్రీనివాస్‌ (26) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాంచన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తుండగా.. శ్రీనివాస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వారు పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమనుకొని ప్రాణాలు తీసుకున్నారు. దీంతో వీరిద్దరూ కారులోనే కూర్చొని కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు