Nalgonda: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి

24 Oct, 2021 10:57 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: రెండేళ్లుగా ప్రేమించుకున్న ప్రేమికులు విడిపోయి ఉండలేక మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. ట్రైనీ ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొం డ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలం తెట్టెకుంటకు చెందిన మట్టిపల్లి దుర్గయ్య, సాలమ్మ దంపతులకు నలుగురు సంతానం. అందులో మొదటివాడు మట్టిపల్లి కొండలు (22) హాలియాలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఉగ్గిరి నాగయ్య, సైదమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ఉగ్గిరి సంధ్య(20) ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. కొండలు, సంధ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంధ్యకు పీఏ పల్లి మండలం ఘనపురం గ్రామానికి చెందిన మేనత్త కుమారుడితో ఈ నెల 22న నిశ్చితార్థం కాగా. వచ్చేనెల 11న పెళ్లి జరగాల్సి ఉంది.

ఉరివేసుకుందామని భావించి.. 
22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంధ్య.. కొండలు ఇంటికి వచ్చింది. ఇద్దరూ కలిసి నూడుల్స్‌ తిన్నారు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇంట్లో ఉరివేసుకునేందుకు ఫ్యాన్‌కు చీర కట్టారు. ఫ్యాన్‌ సరిగ్గా లేదని తెలుసుకుని ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. కాసేపటి తర్వాత సంధ్య వాళ్ల ఇంటికి వెళ్లి వాంతులు చేసుకోవడాన్ని వాళ్ల నాన్నమ్మ గమనించి పురుగుల మందు తాగినట్లు తెలుసుకుంది. కొండలు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు ఇద్దరినీ హాలియాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. కొండలును కుటుంబ సభ్యులు నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కొండలు మృతి చెందాడు. కొద్దిసేపటికే నల్లగొండ ఆస్పత్రిలో సంధ్య కూడా మృతి చెందింది. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

కొడుకు బాధ నుంచి తేరుకోకముందే.. 
సంధ్య సోదరుడు వెంకటేశ్వర్లు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ దంపతులకు కూతురూ దూరమై మరింత కడుపుకోతను మిగిల్చింది. ‘ఏడాదిలోనే ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న నాదేమి రాత రా దేవుడా’అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది.  

చదవండి: డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఏకంగా కుటుంబమే..

మరిన్ని వార్తలు