పట్టాలపై నలిగిన ఫేస్‌బుక్‌ ప్రేమ 

24 Mar, 2021 09:00 IST|Sakshi

పెళ్లికి పెద్దలు అంగీకరిచరేమో అని యువ జంట ఆత్మహత్య 

సూరారెడ్డిపాలెం సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఘటన 

పేద కుటుంబాల్లో తీరని శోకం 

సాక్షి, ఒంగోలు: తొమ్మిది నెలల క్రితం ఇద్దరు యువతీ యువకుల మధ్య ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారింది. ఆ వ్యవహారం పెద్దల దృష్టికి వెళ్లక ముందే కులాంతర వివాహానికి అంగీకరించరేమో అనే ఆందోళన మొదలైంది. ఇరవయ్యేళ్లు కూడా నిండని ఆ యువ జంట రైలు పట్టాలపై నలిగి తనువు చాలించింది. నాలుగు రోజుల కిందట ఒంగోలు శివారు పెళ్లూరు సమీపంలో ఇదే తీరులో జరిగిన ఘటన మరువక ముందే అక్కడికి సమీపంలో మంగళవారం మరో జంట దేహాలు పట్టాలపై ఛిద్రమయ్యాయి. ఎన్నో ఆశలతో బిడ్డలను చదివిస్తున్న రెండు నిరుపేద కుంటుంబాల్లో తీరని శోకం మిగిలింది. 

ఒంగోలు శివారు కొప్పోలుకు చెందిన భవనం వెంకటేశ్వరరెడ్డి, సుజాత దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొడుకు స్మార్ట్‌ ఫోన్‌ కావాలని గోల చేస్తుండటంతో మూడు నెలల కిందట సుజాత కష్టం చేసి దాచిన రూ.12 వేలతో కొనిచ్చింది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఫోన్‌తో సమయం గడుపుతున్న అతడికి ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది.

వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన నాగినేని ఇందు కుటుంబం వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి నాగినేని పుల్లయ్య ఏడాది కిందట మరణించడంతో తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంట్లోని ఒక భాగాన్ని అద్దెకు ఇవ్వడంతో వచ్చే కొద్దిపాటి సొమ్ము, తల్లికి వచ్చే పింఛనే ఆ కటుంబానికి జీవనాధారం. కొద్ది రోజుల కిందట ఓ యువతి తన కుమారుడికి తరచూ ఫోన్‌ చేస్తుండటం గమనించిన సుజాత కంగారు పడింది. ఈ వ్యవహారం తల్లికి తెలియడంతో విష్ణువర్దన్‌రెడ్డి ఆ ఫోన్‌ను కాస్తా పగలగొట్టాడు. కానీ స్నేహితుడి మొబైల్‌ నుంచి ఇందుతో టచ్‌లో ఉన్నాడు. సోమవారం రాత్రి ఇంటి సమీపంలోని బడ్డీ కొట్టుకు వెళ్లి పెరుగు పాకెట్‌ తెస్తానని వెళ్లిన ఇందు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక వెదుకుతున్నారు.  

హాల్‌ టికెట్‌ ఆధారంగా గుర్తింపు.. 
ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలోని ఐఓసీ పెట్రోలు బంకు వెనుక రైల్వే ట్రాక్‌పై యువ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సీఐ ఎండ్లూరి రామారావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మొండెం నుంచి తల వేరు అయిన స్థితిలో యువతి, పూర్తిగా ఛిద్రమైన యువకుడి మృతదేహంతో ఆ ప్రదేశం భీతావహంగా కనిపించింది. ఘటనా స్థలానికి సమీపంలో లభించిన హాల్‌ టికెట్‌ ఆధారంగా యువకుడు రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిగా గుర్తించిన పోలీసులు కాలేజికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుడు కొప్పోలుకు చెందిన భవనం విష్ణువర్దన్‌రెడ్డి (19)గా నిర్ధారించారు.

అతడి స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం మృతురాలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు(18) అని, వీరిద్దరికీ 9 నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం అయినట్టు వెల్లడైంది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇందు ఎక్కడి వెళ్లిందో తెలియక వెతుకుతూనే ఉన్నామని విష్ణువర్దన్‌రెడ్డితో ప్రేమలో ఉందనే విషయం తమకు తెలియదని ఆమె బంధువులు తెలిపారు. కులాంతర వివాహానికి అడ్డంకులు వస్తాయనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తూ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.   

మరిన్ని వార్తలు