కారులో పెట్రోల్‌ పోసుకుని ప్రేమికుల సజీవ దహనం

23 May, 2022 05:29 IST|Sakshi
జ్యోతి, యశవంత యాదవ్‌ (ఫైల్‌)

బనశంకరి: కారులో పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకుని ప్రేమజంట సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో ఉడుపి జిల్లా బ్రహ్మవర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. బెంగళూరు సుల్తాన్‌పాళ్యవాసి యశవంత్‌యాదవ్‌ (23), మనోరాయనపాళ్యవాసి జ్యోతి (23) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి బీకాం చదివింది. యశవంత్‌ కంప్యూటర్‌ కోర్సు చేశాడు. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు యశవంత్‌ కంప్యూటర్‌ క్లాస్‌కు వెళ్తానని ఇంట్లో చెప్పి బైక్‌పై బయటకు వెళ్లాడు.

జ్యోతి కూడా పని ఉందని బయటకు వెళ్లింది. రెండురోజులైనా కనిపించకపోవడంతో ఇద్దరి తల్లిదండ్రులూ హెబ్బాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమ జంట మంగళూరుకు వెళ్లి తమకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక అద్దె ఇంటిని తీసుకున్నారు. అక్కడే హుసేనఖ అనే వ్యక్తి నుంచి స్విఫ్ట్‌ కారును బాడుగకు తీసుకుని ఉడుపికి వెళ్లారు. ఉడుపిలో వివిధ దేవస్థానాలను సందర్శించి ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. యశవంత్‌ తన సోదరునికి మెసేజ్‌ పంపాడు.

తరువాత ప్రేమికులు కారులోనే కూర్చుని పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలు చెలరేగి కారులో గ్యాస్‌ సిలండర్‌ పేలిపోవడంతో యశవంత్‌ శరీరం బయటకు ఎగిరిపడింది. జ్యోతి కారులోనే కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బ్రహ్మవర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు