కలిసి బతకలేమని.. ప్రియుడి మృతి, చున్నీ తెగిపడి..

2 Apr, 2022 11:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రేమ పేరుతో ఇద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. కులాలు వేరైనా నమ్ముకున్న ప్రేమ కోసం ఏకమవుదామనుకున్నారు. కానీ ఇరువర్గాల పెద్దలు కులాంతర వివాహానికి అడ్డు చెప్పడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చర్ల అంకిరెడ్డి పల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది.  

గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మోతకాని సత్తయ్యకు ఇద్దరు కుమారులు. వీరిది వ్యవసాయ కుటుంబం. సత్తయ్య చిన్నకుమారుడు నరేశ్‌ (26) సిద్దిపేటలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. నరేశ్‌కు 8 నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన నెలకే అతడితో గొడవ పడి వెళ్లిపోయింది. కాగా నాలుగేళ్లుగా నరేశ్‌ ఇంటి సమీపంలో ఉండే కొయ్యడ అశ్విని(22)తో ప్రేమలో ఉన్నాడు.

ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను  పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో మార్చి 30న  ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు నరేశ్‌పై కేసు నమోదు చేశారు. కాగా శుక్రవారం సికింద్లాపూర్‌ శివారులో గుట్టల వద్ద చెట్టుకు ఉరేసుకుని ఉండటం చూసిన ఎల్లారెడ్డి విషయాన్ని నరేశ్‌ కుటుంబీకులకు సమాచారం అందించాడు. వారు నరేశ్‌గా గుర్తించారు. అశ్విని చున్నీ తెగిపోవడంతో కిందపడి అపస్మారక స్థితికి చేరుకుంది. అశ్వినిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  

మరిన్ని వార్తలు