పోలీసుల అదుపులో ఆర్మీ మాజీ ఉద్యోగి

2 Sep, 2021 21:21 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌లో తుపాకీ లైసెన్స్‌ రెన్యువల్‌

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): భూ వివాదంలో ఇద్దరిని తుపాకీతో విచక్షణరహితంగా కాల్చి చంపిన ఆర్మీ మాజీ ఉద్యోగిని మాచర్ల రూరల్‌ పీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు గుంటూరు రూరల్‌ ఏఎస్పీ ఎన్‌వీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. అతని నుంచి ఒక తుపాకీ, బుల్లెట్లను సీజ్‌ చేసినట్లు చెప్పారు. రూరల్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్, మాచర్ల రూరల్‌ పీఎస్‌ సీఐ పి.భక్తవత్సలరెడ్డి, ఎస్‌ఐ ఆర్‌.ఆదిలక్ష్మితో కలిసి బుధవారం ఏఎస్పీ మీడియాతో మాట్లాడారు. మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన మట్టా సాంబశివరావు ఆర్మీ మాజీ ఉద్యోగి.

చదవండి: ప్రభుత్వ భూముల మ్యుటేషన్‌.. 11 మంది వీఆర్వోల సస్పెన్షన్‌


అతనికి స్వగ్రామంలో ఎనిమిది ఎకరాల పొలం ఉంది. 12 ఏళ్లుగా సాంబశివరావుకు సమీప బంధువులైన మట్టా బాలకృష్ణ, మట్టా శివ అలియాస్‌ శివాజి మధ్య పొలం గట్ల విషయంలో వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2012లో సాంబశివరావుపై సమీప బంధువులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి వారిపై అతను కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో సాంబశివరావును అతని తండ్రి చెన్నయ్య రెచ్చగొట్టేవాడు. నువ్వు ఆర్మీ రిటైర్డు ఉద్యోగివి కదా, ఒక తుపాకీ కొనుగోలు చేసి తీసుకొస్తే అవకాశం వచ్చినప్పుడు వారిని తుపాకీతో కాల్చేయ్‌.. ఏమికాకుండా చూసుకుంటానని చెప్పేవాడు.

గత నెల 29న సాయంత్రం సాంబశివరావే కావాలని మట్టా బాలకృష్ణ, శివతో పాటు వారి కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. సాంబశివరావు తనవద్దనున్న తుపాకీతో విచక్షణరహితంగా మట్టా బాలకృష్ణ, మట్టా శివతో పాటు మట్టా వీరాంజనేయులును కాల్చాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాలకృష్ణ, శివ మాచర్ల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయాలైన వీరాంజనేయులును మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు బాలకృష్ణ భార్య శివపార్వతి ఫిర్యాదుతో మాచర్ల రూరల్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. నాగార్జునసాగర్‌రోడ్డులోని కొత్తపల్లి జంక్షన్‌ వద్ద బుధవారం ఉదయం మట్టా సాంబశివరావును అరెస్ట్‌ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో సాంబశివరావు తండ్రిని అరెస్ట్‌ చేయాల్సిఉందన్నారు.

తుపాకీ, బుల్లెట్లు సీజ్‌..   
సాంబశివరావు 2013లో ఆర్మీ నుంచి రిటైరయ్యారు. అప్పట్నుంచి తన తుపాకీ లైసెన్స్‌ రెన్యువల్‌ను ప్రతి మూడేళ్లకు ఒకసారి జమ్మూకశ్మీర్‌లో చేయించుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత నెల 29న జరిగిన భూవివాదంలో అతను 13 బుల్లెట్లను ఉపయోగించగా, 11 బుల్లెట్లు దొరికాయి. 2 బుల్లెట్లు దొరకలేదు. అతని వద్ద మొత్తం 29 బుల్లెట్లు ఉండగా 13 వాడటంతో మిగతా 16 బుల్లెట్లను పోలీసులు సీజ్‌ చేశారు.

చదవండి: విషాదం: ఏమైందో తెలియదు.. తరగతి గది నుంచి బయటకి వచ్చి..

మరిన్ని వార్తలు