ఇంకా మూఢత్వంలోనే.. తానే శివుడు, అవంతికనంటూ

27 Jan, 2021 04:08 IST|Sakshi
నిందితులను పోలీసు వాహనంలో తరలిస్తున్న దృశ్యం 

ఇద్దరు కుమార్తెల్ని కడతేర్చిన కేసులో పోలీసులతో తండ్రి పురుషోత్తం

ఇంకా మూఢత్వంలోనే ఉండి తానే శివుడు, అవంతికనంటున్న తల్లి పద్మజ

ఇద్దరూ అరెస్ట్‌.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలింపు

సాక్షి, మదనపల్లె/మదనపల్లె టౌన్‌: మూఢ నమ్మకాల ఊబిలో కూరుకుపోయి కన్నబిడ్డలు అలేఖ్య (27), సాయిదివ్య (22)లను కడతేర్చిన తల్లిదండ్రులు పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులను మదనపల్లె పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో స్థానిక మాంత్రికులను తీసుకువచ్చి పూజలు జరిపామని.. తాయెత్తులు, ఇంటిముందు మంత్ర యంత్రాలను కట్టామని యువతుల తండ్రి పురుషోత్తమనాయుడు పోలీసులకు చెప్పారు. తల్లి పద్మజ మాత్రం పిచ్చిపిచ్చిగా కేకలు వేస్తూ.. బాబాలు, స్వామీజీల వలే చేతులు తిప్పుతూ.. తానే శివుడినని, అవంతికనని, కరోనా తన నుంచే పుట్టిందని, వ్యాక్సినేషన్‌ అవసరం లేకుండా మార్చికల్లా అంతం చేస్తానంటూ కేకలు వేసింది. చదవండి: (చిత్తూరు జిల్లాలో దారుణం..)

పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసే క్రమంలో కరోనా పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేయగా.. ‘శివుడికే కరోనా పరీక్షలా..! నా గొంతులో హాలాహలం ఉంది. నాకు ఏ పరీక్షలు అవసరం లేదు’ అంటూ వైద్య సిబ్బందిని హడలెత్తించింది. భర్త నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తే.. ‘నువ్వు నా భర్తవు కావు. శివుడిలా మాట్లాడేటప్పుడు కంట్రోల్‌ చేయవద్దన్నానా’ అంటూ విరుచుకుపడింది. పరీక్షల అనంతరం  నిందితులిద్దరినీ రెండో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ ఆసిఫాసుల్తానా ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14రోజుల రిమాండ్‌ విధించగా.. సబ్‌ జైలుకు తరలించారు. తల్లి పద్మజకు జైలులో ప్రత్యేక గది కేటాయించగా.. తండ్రి పురుషోత్తం నాయుడిని సాధారణ బ్యారక్‌లో ఉంచారు. చదవండి: (మదనపల్లి జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్)

మరిన్ని వార్తలు