హత్య, ఆత్మహత్య కోసం ముందే ప్లాన్‌! 

31 Jul, 2021 10:00 IST|Sakshi

చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న జంట

కుటుంబాలు ఒప్పుకోక కొంతకాలం దూరం

నెలన్నర కింద రహస్యంగా వివాహం

కుటుంబాలకు తెలిపే అంశంలో వివాదంతో దారుణం

సాక్షి, గచ్చిబౌలి, బొంరాస్‌పేట: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ లెమన్‌ట్రీ హోటల్‌లో జరిగిన హత్య, ఆత్మహత్యల ఘటనలో పలు అంశాలు బయటికి వచ్చాయి. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న రాములు, సంతోషి.. నెలన్నర కిందటే రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారని, కానీ ఈ విషయాన్ని కుటుంబాలకు తెలిపే అంశంగా గొడవ పడ్డారని తెలిసింది. ఈ క్రమంలో ఆమెను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలని రాములు ముందే నిర్ణయించుకున్నాడని.. స్టార్‌ హోటల్‌కు తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడని సమాచారం. 

చిన్ననాటి స్నేహం నుంచి.. 
మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్‌లో గురువారం సాయంత్రం యువతి హత్య, యువకుడి ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నారాయణపేట జిల్లా హకీంపేటకు చెందిన జి.రాములు (25), వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం లగచర్లకు చెందిన ఈడిగి సంతోషి (25) ఇద్దరూ హకీంపేటలోని జెడ్పీ హైస్కూలులో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య నెలకొన్న స్నేహం తర్వాత ప్రేమగా మారింది. కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించలేదు. ఈ విషయంగా చిన్న గొడవలు కూడా జరిగినట్టు తెలిసింది. దీనితో రాములు, సంతోషి విడిపోతామని తమ కుటుంబాలకు చెప్పారు. కానీ తరచూ కలుస్తూ వచ్చారు.

నెలన్నర రోజుల కిందే ప్రేమ వివాహం చేసుకున్నా.. కుటుంబాలకు తెలియకుండా ఉంచారు. తాజాగా పెళ్లి విషయాన్ని తమ కుటుంబాలకు చెప్పే విషయమై ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవకు దారితీసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాములు ఆమెను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడని.. లెమన్‌ట్రీ హోటల్‌కు వెళ్లేప్పుడే బ్లేడ్‌ను తెచ్చుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. కాగా.. సంతోషి, రాములు మృతదేహలకు కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. 

మరిన్ని వార్తలు