నీ పేరేంట్రా.. మానసిక వృద్ధ వికలాంగుడిపై పైశాచికంగా దాడి, విద్వేష హత్యగా గుర్తింపు

21 May, 2022 14:59 IST|Sakshi

భోపాల్‌: మతం పేరిట మానసిక వికలాంగుడు, అందునా వృద్ధుడిపై దాడి చేసిన హేయనీయమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. పైగా దాడి చేసింది బీజేపీ మాజీ కార్పొరేటర్‌ భర్త కావడంతో ఈ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మానసిక వికలాంగుడైన ఓ వృద్ధుడిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరించడం, అందులో మతం పేరిట అతనిపై దాడి చేయడం సంచలనం సృష్టించింది.  ఈ ఘటన తర్వాత ఆ వృద్ధుడు విగతజీవిగా కనిపించడంతో.. తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయ విమర్శలు రావడంతో.. పోలీసులు దాడి, హత్య కేసు నమోదు చేసుకున్నారు. పైగా దాడికి పాల్పడింది బీజేపీ మాజీ కార్పొరేటర్‌ భర్త కావడంతో.. ఘటన చర్చనీయాంశంగా మారింది. 

నీముచ్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది దినేష్‌ కుష్వాహగా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని వృద్ధుడిపై దాడికి పాల్పడుతూ.. ‘నీ పేరేంట్రా? మహమ్మదా? నీ ఆధార్‌ కార్డు తీయ్‌ ముసలోడా’ అంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. దుర్భాషలాడుతూనే ముఖం మీద కొట్టడం ఆ వీడియోలో ఉంది. పాపం.. ఏ జరుగుతుందో కూడా అర్థంకానీ స్థితిలో ఆ వృద్ధుడు అవస్థ పడడం వీడియోలో గమనించొచ్చు. తన దగ్గరున్న డబ్బు సంచి చూపించే ప్రయత్నం చేయగా.. నిందితుడు పదే పదే ఆ వృద్ధుడిపై దాడి చేశాడు. గురువారం ఈ దాడి ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.

బాధితుడిని రట్లమ్‌ జిల్లా సాస్రికి చెందిన భనర్వల్‌లాల్‌ జైన్‌గా గుర్తించారు. రాజస్థాన్‌లో దైవదర్శనానికి భనర్వల్‌లాల్‌ కుటుంబం. అయితే అక్కడే ఆయన తప్పిపోయాడు. మే 15వ తేదీ నుంచి భనర్వల్‌లాల్‌ కనిపించకుండా పోయాడని ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో భనర్వల్‌లాల్‌ మృతదేహం లభ్యంకాగా, ఆ తర్వాతే దాడి వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

ఇదిలా ఉండగా రాజకీయంగా ఈ దాడి దుమారం రేపడంతో.. హోం మంత్రి నరోట్టమ్‌ మిశ్రా స్పందించారు. నేరస్తుడు.. నేరస్తుడే అని.. దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు దినేష్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు