అయ్యో పాపం.. దీక్షిత్‌ను చంపేశారు

22 Oct, 2020 10:12 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: బావమరిది బతుకు కోరతాడు...దాయాది చావు కోరతాడు అంటారు... అయితే మహబూబాబాద్‌లో కిడ్నాప్‌ అయిన దీక్షిత్‌ రెడ్డి పాలిట మేనమామ కంసుడిలా మారాడు. డబ్బులు కోసం తోబుట్టువుకు కడుపుకోత మిగిల్చాడు. మేల్లుడిని దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. గత ఆదివారం కిడ్నాప్‌ చేసిన దీక్షిత్‌ రెడ్డి... కిడ్నాపర్లు రెండు గంటల్లోనే బాలుడిని చంపేశారు. కిడ్నాప్‌కు సూత్రధారుడు మనోజ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంద సాగర్‌ అనే వ్యక్తితో కలిసి బాలుడిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని గుట్టలో బాలుడి మృతదేహం లభించింది. కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని ఆశపడ్డ ఆ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. 

మహబూబాబాద్‌ కృష్ణా కాలనీకి చెందిన రంజిత్‌, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటుండగా గత ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగుడు బైక్‌పై వచ్చి కిడ్నాప్‌ చేశారు. రాత్రి అయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాలను వెతుకగా ఓ వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లాడని తోడి స్నేహితులు చెప్పారు. రాత్రి 9:45 నిమిషాలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే తమ బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి  చెప్పవద్దని హెచ్చరించారు. పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని, బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మంగళవారం రాత్రి కిడ్నాపర్లు మరోసారి ఫోన్‌ చేసి డబ్బులు రెడీ అయ్యాయా, బుధవారం ఉదయం ఫోన్‌ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు డబ్బు సిద్ధం చేసుకోండి, బ్యాగులో డబ్బు పెడుతున్నప్పుడు వీడియో కాల్‌ చేస్తే తమకు చూపించాలని చెప్పినట్లు సమాచారం.

అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు కిడ్నాపర్లు వీడియో కాల్‌ చేయగా, బాలుడి తల్లిదండ్రులు డబ్బు చూపించారు. దీంతో కిడ్నాపర్‌ జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా వద్ద డబ్బు బ్యాగ్‌తో ఉండాలని,, వచ్చి తీసుకుంటామని చెప్పారు. దీంతో బాలుడి తండ్రి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు డబ్బుతో ఎదురుచూశారు. ఆ సమయంలోనే పోలీసులు మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఆ రోజు ఉదయం 11 గంటలకు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించనున్నారు. [ చదవండి: దీక్షిత్‌ను హత్య చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌! ]

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు