దీక్షిత్‌ హత్య : ఆ దురాశతోనే కిడ్నాప్‌ చేసి..

22 Oct, 2020 12:10 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : అతి తొందరగా డబ్బులు సంపాదించాలనే దురాశతోనే మంద సాగర్‌ అనే వ్యక్తి దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేసి, ఆ తర్వాత గుర్తుపడుతాడనే భయంతో బాలుడిని గొంతునులిమి చంపాడని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. కిడ్నాప్‌ చేసిన రెండు గంటల్లోనే దీక్షిత్‌ని హత్యచేచేశాడని చెప్పారు. గురువారం ఆయన దీక్షిత్‌ హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. 

‘మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన రంజిత్‌ రెడ్డి ఓ టీవీ చానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు ఆయన పెద్ద కుమారుడు దీక్షిత్‌ రెడ్డి(9)ని ఎవరో గుర్తితెలియని వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. ఇట్టి కిడ్నాప్‌ గురించి బాలుని తల్లిదండ్రులు మహబూబాబాద్‌ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేయగా.. మంద సాగర్‌ అనే వ్యక్తి కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించాం. నిందితుడు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతి తొందరలో డబ్బులు సంపాదించాలనే దురాశతోనే కిడ్నాప్‌ చేసినట్లు విచారణలో తేలింది. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల నుంచి బాలుడిని తీసుకెళ్లాడు.  తాళ్లపూసలపల్లి పరిసరాల్లోకి తీసుకెళ్లి కొద్దిసేపు గడిపాడు.

బాలుడిని కంట్రోల్‌ చేయడం మంద సాగర్‌కు కష్టంగా మారింది. దొరికిపోతాననే భయంతో దీక్షిత్‌ను గొంతు నులిమి చంపాడు. అనంతరం రూ.45లక్షలు డిమాండ్‌ చేశాడు. చంపిన తర్వాత రెండు రోజుల పాటు ఫోన్లు చేస్తునే ఉన్నాడు. సాంకేతిక ఆధారాలతో కిడ్నాపర్‌ కోసం గాలించాం. 30 మంది అనుమానితులను ప్రశ్నించాం. కిడ్నాపర్‌ వాడిన టెక్నాలజీతోనే నిందితుడిని పట్టుకున్నాం. మంద సాగర్‌ ఒక్కడే దీక్షిత్‌ను హత్య చేశాడు. నిందితుడిని పూర్తిగా విచారిస్తే మరిన్ని నిజాలు బయటపడొచ్చు’అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా