ఇది దారుణం.. వాట్సాప్‌ గ్రూపునకు అడ్మిన్‌ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి

3 Sep, 2022 10:24 IST|Sakshi
సీఐకి ఫిర్యాదు చేస్తున్న  వాట్సాప్‌ గ్రూప్‌ మాజీ అడ్మిన్లు 

జడ్చర్ల: వాట్సాప్‌ గ్రూప్‌లో అడ్మిన్‌గా చేరి తర్వాత తమనే గ్రూపు నుంచి తొలగించారంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు కౌన్సిలర్‌ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్లకు చెందిన చైతన్య, వసీంలు పట్టణంలోని 25వ వార్డు పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

ఈ క్రమంలో గ్రూప్‌లో తనను కూడా సభ్యురాలిగా చేర్చుకోవాలని కోరుతూ కౌన్సిలర్‌ లత కోరగా...అడ్మిన్‌గా అవకాశం కల్పించారు. కొద్దిరోజుల తర్వాత గ్రూపు నుంచి తమనే తొలగించిందని, తమ గ్రూపును తమకు ఇప్పించాలంటూ చైతన్య, వసీంలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దీనిపై సదరు కౌన్సిలర్‌ స్పందిస్తూ...గ్రూప్‌ను క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లాలనే తాను అడ్మిన్‌గా వ్యవహరిస్తున్నానని, తాజా ఫిర్యాదుతో తాను ఆ గ్రూప్‌నుంచి వైదొలుగుతున్నానని, మరో కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు