ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

6 Aug, 2022 11:53 IST|Sakshi

సాక్షి, ముంబై: ఏడేళ్ల బాలికపై ఆత్యాచారం, హత్య చేసిన నిందితుడు తేజస్‌ దల్వీ (24)ని పుణే జిల్లా పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేశారు. సాక్షాధారాలు నష్టం చేసేందుకు ప్రయత్నించిన తేజస్‌ తల్లి సుజాత దల్వీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ కోఠార్ణే గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అదనంగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది.

పుణే జిల్లా మావళ్‌ తాలూకా కోఠార్ణే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఈనెల రెండో తేదీ నుంచి అదృశ్యమైంది. అంతటా గాలించినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు బాలిక తండ్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అంతటా గాలించగా.. చివరకు బుధవారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాల వెనకాల నగ్నస్థితిలో ఉన్న బాలిక మృతదేహం లభించింది. ఈ వార్త దావానలంలా ఊరంతా పాకింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గుమిగూడారు. పోలీసులు వెంటనే శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్లు నివేదిక వచ్చింది.

గ్రామస్తుల ఆగ్రహాన్ని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 24 గంటల్లోనే కామాంధుడు తేజస్‌ దల్వీని అరెస్టు చేసినట్లు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ శేల్కే వెల్లడించారు. అనంతరం చేపట్టిన విచారణలో తేజస్‌ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు బాలిక ఉంటున్న పక్కింట్లోనే నివాసముంటున్నట్లు తెలిసింది. నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలియగానే మావళ్‌ తాలూకా హద్దులో ఉన్న గ్రామాల ప్రజలందరూ కోఠార్ణే గ్రామానికి తరలివచ్చారు.
చదవండి: నా చావుకు కారణం వారే.. పిన్ని వాయిస్‌ రికార్డ్‌ బయట పెట్టడంతో..

అంతటితో ఊరుకోకుండా నిందితున్ని ఉరి తీయాలంటూ విద్యార్థులు, మహిళా సంఘాలు, స్థానికులు మోర్చా నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మహిళా కమిషన్‌ వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఈ  కేసు విచారణ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా జరిపించి నిందితున్ని వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు