మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం

26 Jan, 2022 04:59 IST|Sakshi
గంజాయి నిందితులను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

నర్సీపట్నంలో కారుతో హల్‌చల్‌

అడ్డొచ్చిన ప్రతి దానిని గుద్దుకుంటూ వెళ్లిన వైనం

సినిమా సీన్‌ను తలపించిన ఘటన

ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు

నర్సీపట్నం (విశాఖపట్నం): నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. వెనుక పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళ్తూ అడ్డొచ్చిన .. ప్రతి దానిని గుద్దుకుంటూ అలజడి రేకెత్తించారు. ఘటన వివరాలిలాఉన్నాయి.  మహారాష్ట్రకు చెందిన సిద్ధూ, ఇఫ్రాన్, రోహిత్‌ చింతపల్లిలో  240 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. మహారాష్ట్ర తీసుకెళ్లేందుకు కారులో నర్సీపట్నం వైపు వస్తుండగా.. డౌనూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అపేందుకు ప్రయత్నించగా తప్పించుకుని వచ్చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సీపట్నం ట్రాఫిక్‌ ఎస్‌ఐకు కారులో వస్తున్న గంజాయి స్మగ్లర్ల సమాచారం అందించారు.  

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అబిద్‌సెంటర్‌ వద్ద పోలీసులు స్మగ్లర్ల కారును ఆపేందుకు ప్రయత్నించగా వృద్ధురాలికి  డాష్‌ ఇచ్చి వేగంగా దూసుకెళ్లారు.  శ్రీకన్య సెంటర్‌లో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ ఆపే ప్రయత్నం చేయగా.. బారికేడ్లను గుద్దుకుని వెళ్లిపోయారు. వెంటనే ఎస్‌ఐ ద్విచక్రవాహనంపైన, పోలీసు వాహనంతో సిబ్బంది గంజాయి కారును వెంబడించారు. గంజాయి స్మగ్లర్లు కారుతో ఎలా పడితే అలా దూసుకొస్తుండడంతో వాహనదారులు, ప్రజలు హడలెత్తిపోయారు. స్మగ్లర్ల వాహనం, పోలీసు వాహనం ఒకదాని వెనుక మరొకటి వేగంగా దూసుకెళ్తుండడంతో సినిమా సీన్‌ను తలపించింది. కాగా,  దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు పెదబొడ్డేపల్లి వంతెన సమీపంలో కారును ఆపి వంతెన కింద ఉన్న కాలువలోకి దూకేశారు. దీంతో స్థానికులు,  పోలీసులు వారిని చుట్టుముట్టారు. కాలువలోంచి ముగ్గురు స్మగ్లర్లను బయటకు రప్పించి స్టేషన్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు