అటు తమ్ముడు.. ఇటు అన్న.. భార్యాపిల్లలతో ఒకేసారి, ఒకే టైంలో..

21 Jun, 2022 07:27 IST|Sakshi

సాంగ్లి: మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన పెను విషాదంలో అసలు విషయం తేలింది.  ఇద్దరు అన్నదమ్ములు తమ తమ భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 9 మంది చనిపోయారు. అప్పుల భారంతోనే వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఎంహైసల్‌ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పొపట్‌ వాన్మొరె(56) ఉపాధ్యాయుడు కాగా, మానిక్‌ వాన్మొరె వెటర్నరీ డాక్టర్‌. వీరిద్దరూ తమ కుటుంబాలతో గ్రామంలోనే వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం మానిక్‌ వాన్మొరె ఇంటి తలుపులు తీయకపోయేసరికి చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. ఆ ఇంట్లో మానిక్‌ సహా నలుగురి మృతదేహాలు కనిపించాయి.

విషయం చెప్పేందుకు పొపట్‌ ఇంటికి వెళ్లిన గ్రామస్తులకు ఇదే అనుభవం ఎదురైంది. మానిక్‌ ఇంట్లో మానిక్, ఆయన భార్య, తల్లి, కూతురు, పొపట్‌ కొడుకు విగత జీవులై కనిపించగా, అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పొపట్‌ ఇంట్లో పొపట్, ఆయన భార్య, కూతురు శవాలై పడి ఉన్నారు. వీళ్లంతా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ధృవీకరించారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల పిల్లలు మేజర్లే కాగా, వాళ్ల చదువులు, ఆర్భాటాల కోసం తాహతుకు మించి చేసిన అప్పులు చేసి..  తీర్చలేకనే చనిపోతున్నట్లు ఇద్దరి ఇళ్లలో లభించిన సూసైడ్‌ నోట్లు దొరికాయి.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు