బస్సులో చెలరేగిన మంటలు.. 11 మంది సజీవ దహనం

8 Oct, 2022 12:24 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 11 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరి చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే తెలిపారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నాసిక్ ఔరంగబాద్ హైవేపై ఈ ఘటన జరిగింది. యావత్మాల్ నుంచి ముంబై వెళ్లే బస్సు, పుణె నుంచి నాసిక్ వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టుకోవడం వల్ల  బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్ని పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తాము చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది తప్ప సాయం చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చి మంటలు అదుపు చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

బస్సు యావత్మాల్ నుంచి బయలుదేరినప్పుడు 30 మంది ఉన్నారని, ఆ తర్వాత మధ్యలో మరో 19 మంది ఎక్కారని నాసిక్ పోలీస్ కమిషనర్ జయంత్ నాయక్‌నవారే తెలిపారు. వీరందరినీ గుర్తిస్తున్నట్లు చెప్పారు.

మోదీ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల సాయం ప్రకటించారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం తెలిపింది.

సీఎం రూ.5లక్షలు పరిహారం
ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

చదవండి: చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

మరిన్ని వార్తలు