జారుకుందామని జారిపడ్డాడు

19 Feb, 2022 01:50 IST|Sakshi

తెలంగాణ భవన్‌ మూడో అంతస్తు నుంచి పడిపోయిన మహేష్‌ బ్యాంకు కేసు నిందితుడు 

గాయపడటంతో ఆస్పత్రికి తరలించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

ఢిల్లీ కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా ఘటన 

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ మహేష్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు చెందిన చెస్ట్‌ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసు దర్యాప్తులో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఒక నైజీరియన్‌ దాడి చేసిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం అదుపులో ఉన్న మరో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్‌లోని మూడో అంతస్తు బాల్కనీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ కిందపడ్డాడు. దీంతో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.  

తీవ్ర ఒత్తిడిలో పోలీసు అధికారులు 
గత నెల 22, 23 తేదీల్లో చోటు చేసుకున్న మహేష్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాకింగ్‌పై.. అధికారుల ఫిర్యాదు మేరకు 24న కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.3 కోట్లు ఫ్రీజ్‌ చేయడం మినహా అరెస్టుల విషయంలో కీలక పురోగతి సాధించలేకపోయారు. నగదు బదిలీ అయిన ఖాతాదారులను, సూత్రధారులకు సహకరించిన వారిని మాత్రమే పట్టుకోగలిగారు. సూత్రధారులను పట్టుకోలేకపోవడం, తాజా పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు విభాగం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది.

కీలకపాత్ర పోషించిన నైజీరియన్లు.. 
ఈ కేసులో ఆద్యంతం నైజీరియన్లు కీలకపాత్ర పోషించారు. సూత్రధారులు–పాత్రధారులు–ఖాతాదారుల మధ్య వీరే మధ్యవర్తిత్వం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బెంగళూరులో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌లతో పాటు మణిపూర్‌కు చెందిన యువతి షిమ్రాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీ, ముంబైల్లోనూ కొందరు నైజీరియన్లను అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం ఢిల్లీలో గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందం మరికొందరు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. వీరిలో కొందరిని ఇప్పటికే నగరానికి పంపగా.. ఓ వ్యక్తిని మాత్రం తాము బస చేసిన తెలంగాణ భవన్‌లోని రూమ్‌ నం. 401లో ఉంచింది.

కీలకం కావడంతో తప్పించుకోవాలని... 
ఢిల్లీలోని ఓ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి పోలీసులకు చిక్కిన ఇతడు అత్యంత కీలక నిందితుడిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇతడిని శుక్రవారం ఢిల్లీలోని కోర్టులో హాజరుపరచడంతో పాటు అనుచరులను పట్టుకోవాలని ప్రత్యేక బృందం భావించింది. అయితే శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన నిందితుడు అక్కడ నుంచి ఎలాగో బాల్కనీలోకి వెళ్లి వాటర్‌ పైపుల ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించాడు.

అయితే కింద ఉన్న పోలీసులు గుర్తించి అరవడంతో కంగారుపడ్డ నిందితుడు పట్టుతప్పి అక్కడున్న చెట్టు కొమ్మకు తగులుతూ కింద పడిపోయాడు. గాయపడిన అతన్ని పోలీసులు..పక్కనే ఏపీ భవన్‌లో అందుబాటులో ఉన్న 108 వాహనం మొరాయించడంతో ఆటోలో రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే సదరు వ్యక్తి నైజీరియన్‌ కాదని, ఢిల్లీ (ఘజియాబాద్‌)కే చెందినవాడని చెప్తున్న పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు