కొలిక్కివస్తున్న ‘కాల్పుల’ కేసు

14 Oct, 2020 12:32 IST|Sakshi

గోవా, హైదరాబాద్‌ల నుంచి వచ్చిన అగంతకులు.

ముందుగానే ఆటోలో వచ్చి రెక్కి.

సాక్షి, విజయవాడ: సంచలనం కలిగించిన విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ ఉద్యోగి గజకంటి మహేష్‌ హత్యకేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. మూడు రోజులపాటు అన్ని కోణాల్లో కేసు విచారణ చేసిన ప్రత్యేక బృందం అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారమే మహేష్‌ హత్య జరిగినట్లు నిర్థారణకు వచ్చారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారమే కారణమా..?
ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారమే మహేష్‌ హత్యకు కారణం అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మహేష్‌ స్నేహితుల్లో ఒకరు అగంతకులకు సహకారం అందించి, తమ పథకం ప్రకారం మహేష్‌ను నున్న బైపాస్‌రోడ్డుకు వచ్చేలా చేసి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: ఎవరీ మహేష్‌.. హత్యకు కారణం ఏంటి? 

మూడు రోజులుగా కష్టపడుతున్న పోలీసులు
మహేష్‌ హత్య కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఈ మిస్టరీని ఛేదించేందుకు శనివారం అర్థరాత్రి నుంచి కష్టపడుతున్నారు. సింగ్‌నగర్, పాయకాపురం, నున్న పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను అన్ని కోణాల్లోనూ పరిశీలించారు. ముందుగా స్నేహితులు, ప్రేమ వ్యవహారమని భావించి కొన్ని బృందాలు ఆ దిశగా విచారణ చేయగా, మరికొన్ని బృందాలకు సంఘటన జరిగిన సాయిబాబా బార్‌ వద్ద ఉన్న కారుపై అనుమానం రావడంతో ఆ వివరాలు సేకరించారు. ఆ కారు యాదృచ్ఛికంగా వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ పక్కనున్న ఆటోపై కూడా అనుమానం వచ్చి ఆటో వివరాలను తెలుసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం తెలిసినట్లు సమాచారం. 

ప్రియురాలిపై పెట్రోల్‌ పోసి హత్య
సాక్షి, గాంధీనగర్‌:  ప్రేమిస్తున్న యువతి  తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో ప్రియురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి..తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడో ప్రేమికుడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన నాగభూషణం(27), చిన్నారి(24) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చిన్నారి హనుమాన్‌పేటలోని ఓ ప్రైవేటు కోవిడ్‌ సెంటర్‌లో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నది. స్నేహితురాళ్లతో కలిసి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నది. నాగభూషణం గ్రామంలోనే ఉంటున్నాడు. కొంత కాలంగా ఇద్దరికీ స్పర్థలు రావడంతో అతనిని పట్టించుకోవడం లేదు. ఈ  నేపథ్యంలో ఆ యువకుడు పలుమార్లు చిన్నారి పనిచేస్తున్న హాస్పిటల్‌ వద్దకు వచ్చి వేధించినట్లు తెలిసింది.

అతనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మళ్లీ ఆమె జోలికిరానని నాగభూషణం రాజీకి రావడంతో కేసు వాపసు తీసుకుంది. కాగా, రోజూలానే సోమవారం విధులకు హాజరైన చిన్నారి రాత్రి సమయంలో విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా.. మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నాగభూషణం తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. వెంటనే తను కూడా నిప్పంటించు కున్నాడు. అయితే ఘటనలో చిన్నారి పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన నాగభూషణాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గవర్నర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు