అంతర్రాష్ట్ర క్రికెట్‌ బెట్టింగ్‌ రాకెట్‌ బ్లాస్ట్‌: రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం 

30 Sep, 2021 09:11 IST|Sakshi

మాదాపూర్‌ జోన్‌లో 7 చోట్ల సోదాలు 

23 మంది బూకీల అరెస్ట్‌

రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అంతర్రాష్ట్ర క్రికెట్‌ బెట్టింగ్‌ రాకెట్‌ను సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో తొలిసారిగా అతిపెద్ద బెట్టింగ్‌ ముఠాను పట్టుకున్నారు. మాదాపూర్‌ జోన్‌ పరిధిలోని ఏడు ప్రాంతాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు మియాపూర్, బాచుపల్లి, గచి్చ»ౌలి, మైలార్‌దేవ్‌పల్లిలోని ఏడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి 23 మంది బూకీలను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.93 లక్షల నగదు, 14 బెట్టింగ్‌ బోర్డ్‌లు, 8 ల్యాప్‌టాప్స్, 247 సెల్‌ఫోన్లు, 28 స్మార్ట్‌ఫోన్లు, 4 ట్యాబ్స్, 4 టీవీలు, 2 రూటర్స్, ప్రింటర్, 5 కార్లను  స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2.21 కోట్లు.

పరారీలో ఉన్న మెయిన్‌ బూకీ విజయవాడకు చెందిన మహా అలియాస్‌ సురేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇతను బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. వివరాలను మాదాపూర్‌ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, స్పెషల్‌ ఆపరేషన్‌ టీం(ఎస్‌ఓటీ) డీసీపీ సందీప్‌లతో కలిసి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం మీడియాకు వివరించారు. 

విజయవాడకు చెందిన మెయిన్‌ బూకీ మహా నుంచి లీడ్స్‌ తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన చింత వేణు(35), కర్నాటకలోని రాయచూర్‌కు చెందిన గోదవర్తి వెంకటేష్‌ (32) ఇద్దరు బూకీలుగా అవతారమెత్తి ఏడేళ్లుగా హైదరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌–2021లో మంగళవారం నాటి ముంబై–పంజాబ్‌ మ్యాచ్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు ఫ్యాన్సీ లైఫ్, లైవ్‌ లైన్‌ గురు, క్రికెట్‌ మజా, లోటస్, బెట్‌ 365, బెట్‌ ఫెయిర్‌ వంటి యాప్స్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్, లావాదేవీలను నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా నిఘా పెట్టిన పోలీసులు బెట్టింగ్‌ నిర్వాహకులను మంగళవారం పట్టుకున్నారు.  

పశ్చిమ గోదావరి ఆకువీడుకు చెందిన జెళ్ల సురేష్‌ (33), తిరుమణి మణికంఠ(23), కొల్లాటి మణికంఠ(21), పీ.శ్రీనివాస్‌(35), దుర్గాప్రసాద్‌ కొల్లాటి(22), జమ్ము నాగరాజు(36), ఈదర రవి(36), భీమవరం వడువు అజయ్‌ కుమార్‌ (27), అట్లూరి రంజిత్‌ కుమార్‌(35), జగన్నాథపురంకు చెందిన జయశ్రీనివాస్‌(29), నల్లజర్లకు చెందిన తూరెళ్ల సాయి(24), గుంటూరు జిల్లా మంత్రిపాలెం రేపల్లె నాగళ్ల రాకేష్‌(37), తూర్పు గోదావరి మొగిలి కూడురుకు చెందిన సుందర రామరాజు(34), విజయవాడకు చెందిన కునప్పరెడ్డి దుర్గా పవన్‌ కుమార్‌(32), కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన కోట సాయి నవీన్‌(25), భద్రాచలం గౌరిదేవిపేట్‌కు చెందిన రవితేజ(37), బాచుపల్లికి చెందిన కామగాని సతీష్‌(39), మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మల్లిఖార్జున చారీ(38), కర్నాటకలోని రాయచూర్‌కు చెందిన బొప్ప వెంకటేష్‌ (30), గన్ని కల్యాణ్‌ కుమార్‌ (30), పత్తిపాటి రాము (32)లను అరెస్ట్‌ చేశారు. వీరిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో 7 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మెయిన్‌ బూకీ మహాతో పాటు చెన్ను భాస్కర్‌రెడ్డి, గుంటూరుకు చెందిన సురేష్‌, కేపీహెచ్‌బీకి చెందిన పవన్‌ అలియాస్‌ ప్రవీణ్, రాయచూర్‌కు చెందిన కే.సుమన్, రామాంజనేయ, ముంబైకి చెందిన నందలాల్‌ గోరీ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు ముంబై, గోవా, బెంగళూరు, దుబాయ్‌లో కూడా ఉన్నాయని దర్యాప్తులో తేలిందని చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు