అంతిమ యాత్రకు వెళ్లి.. 18 మంది అనంత లోకాలకు..

29 Nov, 2021 08:41 IST|Sakshi

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం నడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది అసువులు బాశారు. సుమారు 35 మందితో వెళ్తున్న మినీ ట్రక్కు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరో లారీని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. చక్డా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా అతని కుటుంబసభ్యులు, బంధువులు కలిసి మృతదేహాన్ని తీసుకుని నవద్వీప్‌ శ్మశానవాటికకు మినీ ట్రక్కులో బయలుదేరారు.

తెల్లవారుజామున  వారి ట్రాక్కు హన్షకలీ సమీపంలో హైవేపై ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కులోని 12 మంది అక్కడకక్కడే చనిపోగా ఆరుగురు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఐదుగురు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
(చదవండి: వీడు మామూలోడు కాదు.. నాలుగు పెళ్లిళ్లు.. జల్సాలు.. చివరికి)

మరిన్ని వార్తలు