ఆ తల్లిదండ్రులకు ఇది అంతులేని వేదన!

12 Oct, 2021 19:26 IST|Sakshi
మల్లేష్‌ (ఫైల్‌)  

రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి 

ఆరు నెలల క్రితం కుమార్తె... 

దుఃఖసాగరంలో తల్లిదండ్రులు 

సాక్షి, పెందుర్తి: ఆరు నెలల క్రితం అనారోగ్యంతో కుమార్తె మృతి చెందింది. ఆ బాధలోంచి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేదు.. చేతికందిన కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ కుమారుడు కూడా తనువు చాలించాడు. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ఇలా ఆరు నెలల వ్యవధిలోనే కుమార్తె, కుమారుడు మృతి చెందడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఇంకెందుకు మేం బతకాలంటూ వారి వేదన అక్కడ ఉన్నవారిని కలచివేసింది.

వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌.రాయవరం దార్లపూడి గ్రామానికి చెందిన గొంతుమూర్తి లోవరాజు, లక్ష్మి దంపతుల కుమారుడు మల్లేష్‌ (22) పోటీ పరీక్షలకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో నగరంలో జరుగుతున్న ఓ పరీక్ష రాసేందుకు సోమవారం ఉదయం దార్లపూడి నుంచి స్నేహితుడు భీముని ధనరాజుతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. పెందుర్తి కూడలి వద్దకు వచ్చే సరికి వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. మల్లేష్‌ తీవ్రంగా గాయపడగా, ధనరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

చదవండి: (నిరుద్యోగులను ముంచేసిన మహిళా హోంగార్డు)

మల్లేష్‌ను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించగా...చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పెందుర్తి సీఐ కె.అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహిత అయిన మల్లేష్‌ సోదరి ఆరునెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. కుమార్తె మరణించిన కొద్ది రోజులకే కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు లోవరాజు, లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నారు.

చదవండి: (అద్దెకున్న మహిళే హంతకురాలు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు