భర్తతో విడాకులు.. మరొకరితో ప్రేమ.. విధులకు వెళ్తుండగా..

11 Jun, 2022 07:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(బెంగళూరు): సుంకదకట్టెలో యువతిపై యాసిడ్‌ దాడి ఘటన కళ్లముందు మెదులుతుండగానే అలాంటి ఘోరం నగరంలో పునరావృతమైంది. పెళ్లికి నిరాకరించిందని ఓ వివాహితపై ఓ వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఉదంతం కుమారస్వామి లేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. డీసీపీ హరీశ్‌పాండే కథనం మేరకు... యాసిడ్‌ దాడికి గురైన మహిళ కుమారస్వామి లేఔట్‌ పరిధిలోని కర్ణాటక అగరబత్తి  పరిశ్రమలో పనిచేస్తోంది. ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా భర్తతో విడాకులు తీసుకుంది.

ఇదే పరిశ్రమలో పనిచేస్తూ భార్యకు దూరంగా ఉన్న అహ్మద్‌కు, ఆమెకు మధ్య  పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వివాహం చేసుకుందామని అహ్మద్‌ కోరగా తన కుమారుడు పెద్దవాడయ్యాడనే కారణంతో ఆ మహిళ అంగీకరించలేదు. ఇదేవిషయంపై  ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం ఉదయం ఆ మహిళ విధులకు వెళ్తుండగా సారక్కి వద్ద అహ్మద్‌ గొడవపడి యాసిడ్‌ చల్లి ఉడాయించాడు. కుమారస్వామి లేఔట్‌ పోలీసులు బాధితురాలిని వాసన్‌ ఐకేర్‌ ఆసుపత్రికి తరలించారు. కుడి కంటికి తీవ్ర గాయం కావడంతో సంజయ్‌గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు  తెలిపారు. కుమారస్వామి లేఔట్‌ పోలీసులు అహ్మద్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

చదవండి: పబ్‌ దగ్గర దింపేస్తామని తీసుకెళ్లి..

మరిన్ని వార్తలు