చాయ్‌తోపాటు టిఫిన్‌ ఇవ్వలేదని.. కోడలిని కాల్చి చంపాడు

15 Apr, 2022 12:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: పిచ్చి పీక్స్‌కు వెళ్లిన ఓ వ్యక్తి కోడలిపై దాష్టీకానికి పాల్పడ్డాడు. చాయ్‌ (టీ)తో పాటు అల్పాహారం ఇవ్వలేదని ఏకంగా తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన థానేలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాశీనాథ్‌ పాండురంగ్‌ పాటిల్‌ (76)కు అతని కోడలు సీమా రాజేంద్ర (42) గురువారం ఉదయం టీ అందించింది. అయితే, టీతో పాటు టిఫిన్‌ కూడా ఇవ్వాలని తెలియదా? అంటూ రెచ్చిపోయిన ఆ పెద్ద మనిషి ఆమెపై మాటలతో విరుచుకుపడ్డాడు. 

అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న లైసెన్స్డ్‌ తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. బాధితురాలి పొట్ట భాగంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. కళ్లముందే ఘోరం జరగడంతో నిశ్చేష్టులైన కుటుంబ సభ్యులు గాయాలపాలైన ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచిందని థానే సీనియర్‌ పోలీస్‌ అధికారి సంతోష్‌ ఘటేకర్‌ తెలిపారు. మృతురాలి తోడి కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కాశీనాథ్‌పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఘటనకు మరేదైన కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు.
(చదవండి: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి..)

మరిన్ని వార్తలు