పెళ్లికి అడ్డొస్తున్నాడని.. తమ్ముడు ఎంత పని చేశాడంటే..

27 Aug, 2021 21:27 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ డాక్టర్‌ బి.రవికిరణ్‌

చింతలపూడి(కామవరపుకోట): కామవరపుకోట మండలం వీరంపాలెం గ్రామంలో నాటుతుపాకీతో అన్నను చంపిన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేశారు. తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.రవికిరణ్‌ వివరాలు వెల్లడించారు. వీరంపాలెం గ్రామానికి చెందిన సుబ్బారావు కుమారులు కూతాడి రాజేష్, కూతాడి కృష్ణలకు ఇంకా వివాహం కాలేదు. మృతుడు కూతాడి రాజేష్‌(23) వ్యసనాలకు బానిసయ్యాడు. గతంలో తండ్రి ఫైనాన్స్‌పై ఆటో కొనివ్వగా, వాయిదాలు సరిగా కట్టనందున కంపెనీ వారు ఆటో సీజ్‌ చేశారు. అప్పటి నుంచి ఇంకో ఆటో కొనివ్వమని రోజు మద్యం సేవించి వచ్చి తండ్రిని వేధించేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం తల్లిదండ్రులతో గొడవ జరగ్గా.. రాజేష్‌ను తమ్ముడు కృష్ణ కత్తితో గాయపర్చాడు.

అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవడం లేదు. కృష్ణకు పెళ్లి కుదరడంతో.. తన పెళ్లి కాకుండా చిన్నవాడి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని రాజేష్‌ బెదిరించాడు. పెళ్లి విషయంలో అడ్డు వస్తుండటంతో అన్నను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కృష్ణ రూ. 16 వేలకు పెదవేగి మండలానికి చెందిన రెడ్డి కృపావరం అలియాస్‌ బాబి వద్ద నాటు తుపాకీ కొని ఎవరికీ తెలియకుండా దాచాడు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో అన్న రాజేష్‌ను నాటు తుపాకీతో చంపి కృష్ణ అక్కడ నుంచి పరారయ్యాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చింతలపూడి సీఐ ఎం.మల్లేశ్వరావు, తడికలపూడి ఎస్సై కె.వెంకన్నలు నిందితుడ్ని పట్టుకుని అతని వద్ద ఉన్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:
ఫలించిన ముందుచూపు: చేతినిండా.. పని..మనీ!  
డీమార్ట్‌, ప్యారడైజ్‌కు భారీ జరిమానా

మరిన్ని వార్తలు