పత్రికల్లో వార్తలు సేకరించి.. ఇంటెలిజెన్స్‌ డీఎస్పీనంటూ..

10 Apr, 2021 11:21 IST|Sakshi

ఇంటెలిజెన్స్‌ డీఎస్పీనంటూ వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో పలువుర్ని మోసగించిన కిరణ్‌ కుమార్‌ నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలుశిక్ష 

గోనెగండ్ల(కర్నూలు జిల్లా): ఇంటెలిజెన్స్‌ డీఎస్పీనని తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడిన సగ్గల కిరణ్‌ కుమార్‌కు పత్తికొండ కోర్టు మూడేళ్ల జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. గోనెగండ్ల ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కిరణ్‌ కుమార్‌ స్వగ్రామం మిడుతూరు మండలం కడుమూరు. ఎనిమిదో తరగతి దాకా చదివాడు. కర్నూలు బుధవారపేటలో గది అద్దెకు తీసుకుని ఉండేవాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదవశాత్తు, వివిధ కారణాల వల్ల అసహజ మరణం పొందిన వ్యక్తుల వివరాలను దినపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సేకరించేవాడు. తర్వాత ఆయా మండల తహసీల్దార్లు, వీఆర్వోలకు ఫోన్‌ చేసి తాను ఇంటెలిజెన్స్‌ డీఎస్పీనని పరిచయం చేసుకునేవాడు. వారి సాయంతో మృతుల కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లు సేకరించేవాడు. వారికి ఫోన్‌ చేసి మరణించిన వ్యక్తికి సంబంధించి జీవిత బీమా, సీఎం సహాయనిధి కింద ఆర్థిక సహాయం మంజూరైందని నమ్మించేవాడు.

ముందుగా జీఎస్‌టీ కింద కొంత డబ్బు చెల్లించాలంటూ తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకునేవాడు. తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకుని తిరిగేవాడు. మండల కేంద్రమైన గోనెగండ్లలో గత ఏడాది ఏప్రిల్‌ 26న మల్లయ్య అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కిరణ్‌ కుమార్‌ వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశాడు. బీమా సొమ్ము వస్తుందని నమ్మించడంతో మల్లయ్య కుటుంబ సభ్యులు రూ.36 వేల నగదు అతని అకౌంట్‌కు జమ చేశారు. కొద్ది రోజుల తరువాత ఫోన్‌ పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించి గోనెగండ్ల  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి సీఐ పార్థసారథిరెడ్డి  కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  కిరణ్‌ కుమార్‌ను చాకచక్యంగా పట్టుకుని గత ఏడాది నవంబర్‌ 2న అరెస్టు చూపారు. ఇతనిపై అభియోగాలు రుజువు కావడంతో జైలు శిక్ష,  జరిమానా విధిస్తూ పత్తికొండ కోర్టు తీర్పు చెప్పింది.
చదవండి:
పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
కల్తీలపై కొనసాగుతున్న దాడులు

మరిన్ని వార్తలు