అవ్వా! బాగున్నావా? అంటూ మస్కా

4 Feb, 2021 08:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రూ.20వేలు అపహరణ

24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

పలమనేరు(చిత్తూరు జిల్లా): అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా? నీ కొడుకు ఫ్రెండ్‌ని.. అంటూ మాటలు కలిపి నగలు, నగదును దోచుకుంటున్న సంఘటనలు ఇటీవల జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే పలమనేరులోనూ వెలుగుచూసింది. ఎస్‌ఐ నాగరాజు కథనం... గంగవరం మండలం కలిమిచెట్లపెంటకు చెందిన మునిరత్నమ్మ(65) సొంతపనిపై పలమనేరుకు మంగళవారం వచ్చింది. బజారువీధిలో వెళుతుండగా ఓ అపరిచితుడు ఆమెతో మాటలు కలిపాడు. తనది చిత్తూరని, మీ కొడుకు ఫ్రెండ్‌నంటూ చెప్పాడు. అంతేకాకుండా అర్జెంట్‌గా తన తల్లి మునిరత్నమ్మ వద్ద రూ.20 వేలు  తీసుకుని రావాలని తనను పంపాడంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి: కారుతో గుద్ది చంపేస్తాం)

మనవరాలికి ఆరోగ్యం బాగాలేక ఆమె కొడుకు చిత్తూరుకు వెళ్లిఉండడంతో ఆమె నిజమేనని భావించింది. డబ్బులు లేవని చెప్పి, తన చెవిలోని కమ్మల్ని అక్కడే ఉన్న కుదువ దుకాణంలో రూ.25వేలకు తాకట్టు పెట్టింది. రూ.5వేలను తాను ఉంచుకుని రూ.20 వేలను అతనికిచ్చి పంపింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుక్కి ఈ విషయం చెప్పింది. అవాక్కైన అతడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు దిగిన పోలీసులు గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తుల ఫొటోల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన సెంధిల్‌కుమార్‌(35) పనేనని తేలింది. అతడిని బుధవారం అరెస్టు చేసి రూ.20 వేలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయం లేని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు, ఏటీఎం కార్డులు, నగలు లాంటివి ఇవ్వరాదని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.(చదవండి: పిల్లుల కోసం వల వేసినట్లు నటిస్తూ..)  

మరిన్ని వార్తలు