వీడియో కాల్‌తో వివాహితకు వేధింపులు

10 Apr, 2022 08:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ వివాహిత ఫొటోలను అశ్లీలంగా మార్చి ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సాప్‌లో పంపించడంతో పాటు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వేధించిన ప్రబుద్ధుడిని రాచకొండ సైబర్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ జె.నరేందర్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం కిషన్‌గంజ్‌కు చెందిన మహమ్మద్‌ ఇజ్రాయిల్‌ (28) అబ్దుల్లాపూర్‌మెట్‌ సాదుపల్లికి వలస వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు.

అదే ప్రాంతంలో కూరగాయల విక్రయించే బాధితురాలి దుకాణానికి తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో మోహం పెంచుకున్న ఇజ్రాయిల్‌.. ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకొని వాట్సాప్‌ వీడియో కాల్‌ చేశాడు. ఆమెకు తెలియకుండా వీడియో కాల్‌ను స్క్రీన్‌ షాట్‌ తీశాడు. ఆ తర్వాత నిందితుడు బాధితురాలికి ఫోన్‌ చేసి తనతో వీడియో కాల్‌ మాట్లాడాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నాడు.

స్క్రీన్‌ షాట్‌ తీసిన ఆమె ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించి, కాల్‌ గర్ల్‌గా పేర్కొంటూ వివిధ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలలో పోస్ట్‌ చేశాడు. అంతటితో ఆగకుండా ఫొటోలను ఆమె భర్తకు పంపించడంతో పాటు పలు వాట్సాప్‌ నంబర్ల నుంచి ఫోన్‌ చేసి భార్య గురించి అసభ్యకరంగా దూషించాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు ఇజ్రాయిల్‌ను అరెస్ట్‌ చేసి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  

(చదవండి: మహిళా ఎస్‌ఐ ఆత్మహత్య.. కారణం అదేనా..?)

మరిన్ని వార్తలు