సజీవ దహనం ఘటనలో కొత్త మలుపు.. ఆమెది హత్యే..

16 Mar, 2022 14:06 IST|Sakshi
గౌరమ్మ హత్య వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్‌లు, వెనుక ముసుగులో నిందితుడు సింహాచలం 

తెర్లాం(విజయనగరం జిల్లా): మండలంలోని రాజయ్యపేట గ్రామంలో ఈ ఏడాది జనవరి 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో వృద్ధురాలు గాడి గౌరమ్మ సజీవదహనమైన సంగతి తెలిసిందే. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించిందని అంతా భావించారు. గౌరమ్మను హత్యచేసి కాల్చేసినట్టు నిందితుడు ఒప్పుకోవడంతో అందరూ అవాక్కవుతున్నారు. తెర్లాం పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొబ్బిలి రూరల్‌ సీఐ శోభన్‌బాబు, తెర్లాం ఎస్‌ఐ సురేంద్రనాయు కేసు వివరాలను వెల్లడించారు.

చదవండి: లొంగకపోతే అంతు చూస్తా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి..

గాడి గౌరమ్మకు చేతబడి ఉందన్నది అనుమానం. నాలుగేళ్ల కిందట నిందితుడు రెడ్డి సింహాచలం, ఆయన భార్య, పిల్లలకు గౌరమ్మ చేతబడి చేసిందని, అందుకే అనారోగ్యానికి గురైనట్టు భావించారు. ఆమె చేతబడి చేయడం వల్లే గత ఏడాది అక్టోబర్‌ నెలలో తండ్రికూడా మరణించినట్టు సింహాచలం మనసులో బలంగా నాటుకుపోయింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హతమార్చాలన్న నిర్ణయానికి వచ్చాడు.

ముందురోజే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిదగ్గర వేరే పని ఉందని గొడ్డలిని తీసుకున్నా డు. గౌరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా జనవరి 10 అర్ధరాత్రి ఇంటిలోకి వెళ్లి హతమర్చాడు. సీసాలో తీసుకెళ్లిన పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. ప్రమా దంలో గౌరమ్మ సజీవదహనమైంది. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు సైతం కాలిపోయాయి. అందరూ విద్యుత్‌ షార్ట్‌సర్కూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్టు భావించారు. వృద్ధురాలిని హత్యచేసి పెట్రోల్‌పోసి కాల్చివేసినట్టు సింహాచలం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశారు.

హత్య వెలుగుచూసిందిలా...  
ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రాజయ్యపేటలో పాతినవలస కనకరాజు అనే వ్యక్తి పశువులశాల కాలిపోయింది. ఆ సమయంలో పశువులశాలలో ఉన్న ఎద్దు, ఆవు, దూడను విప్పేందుకు వెళ్లిన బాధితునికి రెడ్డి సింహాచలం తారసపడ్డాడు. అతనిపై అనుమానంతో స్థానిక పోలీసులకు కనకరాజు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ శోభన్‌బాబు, ఎస్‌ఐ సురేంద్రనాయుడు సింహాచలాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. కనకరాజు పశువుల శాలను ఎందుకు కాల్చావని తమదైన శైలిలో ప్రశ్నించారు. పశువుల శాలను కాల్చలేదని, జనవరి 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన గాడిగౌరమ్మ అనే వృద్ధురాలిని మాత్రం తనే గొడ్డలితో నరికి చంపేశానని, అనంతరం పెట్రోల్‌ పోసి కాల్చేసినట్టు నిందితుడు అంగీకరించాడు.

పథకం ప్రకారమే హత్య చేశా... 
గాడి గౌరమ్మను పథకం ప్రకారంగానే హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య, పిల్లలను అత్తవారింటికి పంపించేశానని తెలిపాడు. నాలుగేళ్లుగా ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తున్నానని, ఆ రోజుకు సమ యం అనుకూలించిందన్నాడు. హత్యా నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి బొబ్బిలి కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు