ఉజ్జయిని కేసు: పోలీసుల కళ్ళుగప్పి  నిందితుడు తప్పించుకునే ప్రయత్నం

28 Sep, 2023 21:05 IST|Sakshi

భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని బాలిక రేప్ కేసులో నిందితుడు భరత్ సోనిని ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆధారాలు సేకరించేందుకు సంఘటన స్థలానికి నిందితుడిని తీసుకుని వెళ్లగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడని అప్రమత్తమై పోలీసులు  అతడిని పట్టుకున్నట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. 

సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం..  ఈ కేసులో బాలిక దుస్తులతోపాటు ఇతర ఆధారాలను సేకరించే క్రమంలో నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా అదే అదనుగా భావించి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడని ఈ ప్రయత్నంలో అతడి సిమెంట్ రోడ్డుపై పడిపోవాడంతో మోకాళ్ళకు, కాళ్లకు గాయాలు కూడా అయ్యాయన్నారు. సర్జరీ తర్వాత ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడినా కూడా ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందని తెలిపారు. ఉజ్జయిని ఘోరానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగానే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అక్కడి ఆటో డ్రైవర్లను విచారించి భరత్ సోనీని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పదిహేనేళ్ల బాలిక దుస్తులు లేకుండా రక్తం కార్చుకుంటూ దయనీయ స్థితిలో ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. కనిపించిన వారందరినీ సాయమడుగుతూ చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఇది కూడా చదవండి: బస్సులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి 

మరిన్ని వార్తలు