రూ. రెండు వేల కోసం ప్రాణం తీశాడు

25 Mar, 2021 08:33 IST|Sakshi

ఖానాపూర్‌: తీసుకున్న డబ్బులు రూ. రెండు వేలు ఇవ్వలేదని తోటి వలస కూలీ హన్మంతరావును పథకం ప్రకారమే బాపూజి హత్య చేశాడని ఖానాపూర్‌ సీఐ శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వలస కూలీ హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. పట్టణానికి చెందిన మేస్త్రీ నవీన్‌వద్ద పనిచేసేందుకు ప్రకాశం జిల్లా ఇంకోలుకు చెందిన కడియాల హన్మంతురావు(38), బాపూజిలు వారం క్రితం ఖానాపూర్‌కు వచ్చారు. గతంలోనూ వీరిద్దరు కలిసి పనిచేశారు.

విద్యానగర్‌లోని ఓ ఇంట్లో వీరిద్దరు అద్దెకు ఉంటున్నారు. ఆదివారం విద్యానగర్‌లోని వైన్స్‌లో మద్యం సేవించే సమయంలో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తదనంతరం ఇంటికి వెళ్లాక కూడా గొడవ జరగ్గా హన్మంతుపై పగ పెంచుకున్న బాపూజి రాడుతో తలపై పలుమార్లు బాది హతమార్చాడు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని బయట పడేసి గ్రామ శివారు ప్రాంతానికి పారిపోయాడు. దాడి సమయంలో నవీన్‌ సోదరుడు ప్రేమ్‌ కూడా అక్కడే ఉన్నాడని సీఐ వివరించారు. రూ. 2 వేల కూలీ డబ్బులు ఇవ్వలేదని, తాగడానికి బీడీలు కూడా ఇవ్వలేదని దాడిచేసి హత్యచేశాడని సీఐ తెలిపారు. బుధవారం తర్లపాడ్‌ క్రాస్‌రోడ్డు వద్ద నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశామన్నారు. ఇంటి యజమాని భారతీ వీరకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కాగా విచారణకు కృషిచేసిన ఎస్సై రామునాయక్‌తో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ తుకారం, ఐడీపార్టీ కానిస్టేబుల్‌ ఉషన్న, హోంగార్డు శ్రీనివాస్‌లను సీఐ అభినందించారు.  

మరిన్ని వార్తలు