చెల్లెని బాగా చూసుకోవాలని  చెబితే.. నాకే నీతులు చెబుతావా అంటూ..

26 Dec, 2021 13:07 IST|Sakshi

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన 

సాక్షి, తుర్కపల్లి: ‘బావా మా అక్కను ఎందుకు వేధిస్తున్నావు.. కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు సాధారణమే.. చీటికి మాటికి గొడవలు పడితే చులకనవుతారు.. సర్దుకుపోయి కాపురాన్ని చక్కదిద్దుకోవాలి.. పిల్లల ముఖం చూసైనా మారాలి’అని సర్దిచెప్పిన బావమరిదికి అవే ఆఖరి మాటలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న ఆ బావ తీవ్ర ఆగ్రహంతో.. ‘నాకే నీతులు చెబుతావా’అంటూ ఇటుకతో బావమరిదిపై దాడి చేసి కడతేర్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్రవల్లి వెంకటేశానికి సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన కృష్టవేణితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. వెంకటేశం బ్యాండ్‌ మేళంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.  

అనుమానం పెంచుకుని.. 
కొన్నేళ్ల నుంచి వెంకటేశం దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశం మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తాగి వచ్చి భార్యను కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే తరుణంలో శుక్రవారం కూడా వెంకటేశం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి జరిగిన విషయాన్ని సోదరుడు రాచకొండ రమేశ్‌కు ఫోన్‌లో వివరించి రోదించింది. భర్త ఇబ్బందులు పెడుతున్నాడని వెంటనే రావాలని కోరింది.  

నిలదీస్తే దాడి చేసి.. 
సిద్దిపేట జిల్లా మామిడ్యాలలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న రాచకొండ రమేశ్‌ శుక్రవారం రాత్రి మాదాపూర్‌ గ్రామంలోని సోదరి ఇంటికి వచ్చాడు. తన సోదరిని ఎందుకు వేధిస్తున్నావని బావ వెంకటేశాన్ని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆగ్రహంతో వెంకటేశం ఇటుకతో బావమరిది తలపై బలంగా మోదడంతో రమేశ్‌ అక్కడికక్కడే కుప్పకులిపోయాడు. అదే కోపంతో అతడి ఛాతీ, కడుపులో కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గాయపడిన రమేశ్‌ను వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రమే శ్‌ భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నవీన్‌రెడ్డి, ఎస్‌ఐ మధుబాబు తెలిపారు. 

మరిన్ని వార్తలు