రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. 

18 Jun, 2022 07:22 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

మృతుడి ఐడీ కార్డు ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఈసీ నదిలో తేలిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో దొరికిన ప్రెస్‌ ఐడీ  కార్డు ఆధారంగా పోలీసులు కేసులను చేధించారు. శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, బనారస్‌కు చెందిన ప్రమోద్‌కుమార్‌(40) నగరానికి వలస వచ్చాడు. మతం మార్చుకున్న అతను తన పేరును మహ్మద్‌ ఇక్బాల్‌గా మార్చుకున్నాడు. 15 ఏళ్ల క్రితం మెహరాజ్‌బేగంను వివాహం చేసుకుని గోల్కొండ రిసాలా బజార్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

మహ్మద్‌ ఇక్బాల్‌ భూత వైద్యుడిగా, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పని చేసేవాడు. అతను ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ లతీఫ్‌ అలియాస్‌ మన్ను వద్ద గతంలో రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో లతీఫ్‌ తరచు ఇక్బాల్‌ ఇంటికి వచ్చి వెళ్లేవాడు.  దీంతో మెహరాజ్‌బేగంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న  ఇక్బాల్‌ భార్యను హెచ్చరించాడు. లతీఫ్‌ను సైతం తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు. దీంతో ఇక్బాల్, మెహరాజ్‌బేగం తమకు అడ్డుగా ఉన్న ఇక్బాల్‌ను హత్య చేయాలని నిర్ణయించారు.

ఇందుకోసం లతీఫ్‌ మలక్‌పేట్‌ ముసారాంబాగ్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్, గోల్కొండ ప్రాంతానికి చెందిన షేక్‌ సోఫియాన్‌ సహాయం కోరాడు. వీరికి రూ.10 వేలు ఇచ్చి తాను పిలిచిన వెంటనే రావాలని సూచించాడు. ఈ నెల 11న మహ్మద్‌ ఇక్బాల్‌ సిద్ధిపేట వెళ్తున్నట్లు సమాచారం అందడంతో లతీఫ్‌ 11న తెల్లవారుజామున మహ్మద్‌ ఉస్మాన్, షేక్‌ సోఫియన్‌తో కారులో వేచి ఉన్నాడు. ఇక్బాల్‌ యాక్టివాపై టోలిచౌకీ వైపు వెళుతుండగా లక్ష్మిగూడ రోడ్డు వద్దకు రాగానే లతీఫ్‌ కారును బైక్‌కు అడ్డుపెట్టి ఇక్బాల్‌ను కిడ్నాప్‌ చేశాడు.

చదవండి: (ఇద్దరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం.. చివరకు..)

బైక్‌ను షేక్‌ సోఫియాన్‌ తీసుకోగా కారులో లతీఫ్, మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్బాల్‌ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఈసీ నదిలో పారవేశారు. నది వద్దకు కారు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని లాక్కెళ్లారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌కు చెందిన ప్రెస్‌ ఐడీ కార్డు పడిపోయింది. అయితే నదిలో నీరు కొద్దిగా ఉండడంతో మూడు రోజులకే మృతదేహం పైకి తేలింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో దొరికి ప్రెస్‌ ఐడీ కార్డు ఆధారంగా ముందుకు సాగారు.

సీసీ కెమెరాల్లో 11న తెల్లవారుజామున టాటా ఇండికా కారు, యాక్టివా తెల్లవారుజామున రావడం, 25 నిమిషాల్లో తిరిగి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వాటి నంబర్లు లేకపోవడంతో ఆ దిశలో దర్యాప్తు ప్రారంభించారు. ఇక్బాల్‌ మృతిపై అతడి భార్యకు సమాచారం అందించగా తన భర్త మూడు రోజుల క్రితం బయటికి వెళ్లి రాలేదని చెప్పింది. మూసీ నదిలో దొరికిన మృతదేహాన్ని చూసినా ఆనవాళ్లు సరిగ్గా చెప్పకపోడంతో ఆమెను మరింత లోతుగా ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు)

>
మరిన్ని వార్తలు