అప్పుడు మొదటి భార్యను, ఇప్పుడు రెండో భార్యను..

18 May, 2021 14:12 IST|Sakshi
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి

సాక్షి, వరంగల్‌: ఇద్దరు భార్యలను కడతేర్చిన కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి సోమవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో వెల్లడించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన ఒడవల్లి అంజలి(42)ని అదనపు కట్నం కోసం వేధించి కర్రతో ఈనెల 12న తీవ్రంగా దాడి చేయడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె భర్త కర్ణే కిరణ్‌ను అరెస్టు చేసి విచారించగా మొదటి భార్యను సైతం హత్య చేసిన విషయం వెలుగు చూసింది.

మొదటి నుంచి జులాయిగా..
నిందితుడు కిరణ్‌ మొదటి నుంచి జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో తల్లిదండ్రులు ఆయనను వదిలేసి మహబూబాబాద్‌కు వలస వెళ్లారు. పదో తరగతి వరకు చదువుకున్న ఆయన 2013లో సంగెం మండలం గవిచర్లకు చెందిన చిలువేరు పద్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. అనంతరం గ్రామం వదిలేసి వెళ్లిపోయాడు.

అనంతరం 2019లో కమలాపూర్‌ మండలం ఉప్పల్‌కు చెందిన ఒడపల్లి అంజలిని వివాహం చేసుకున్నాడు. ఆమె హుజూరాబాద్‌ మండలం సాధిరెడ్డిపేటలో ఏఎన్‌ఎంగా పనిచేస్తుండేది. వివాహం తర్వాత అంజలి ఇంట్లోనే మూడు నెలలు ఉన్న కిరణ్‌ అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు ఉద్యోగం చేసే చోట ఇతరులతో చనువుగా ఉంటుందని అనుమానించాడు. అక్కడ నుంచి కాపురాన్ని ఆరునెలల క్రితం ఏనుగల్లుకు మార్చాడు. ఈ క్రమంలో అంజలి తల్లిదండ్రుల పేర ఉన్న ఇల్లును అమ్మి అదనపు కట్నం తీసుకురావాలని గొడవపడేవాడు. ఈనెల 12న రాత్రి కూడా గొడవ జరగగా ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అంజలిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈనెల 14న మృతి చెందింది.

అంజలి హత్య ఘటనలో నిందితుడు కిరణ్‌ అరెస్టు చేసి విచారించగా మొదటి భార్య హత్య కూడా బయటపడింది. అలాగే, రెండో భార్య అంజలి వేధించే క్రమంలో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఆ తర్వాత వీడియో చూస్తూ పైశాచిక ఆనందం పొందేవాడని గుర్తించారు. కాగా, నిందితున్ని అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన మామూనూర్‌ ఏసీపీ నరేష్‌ కుమార్, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్‌ కిషన్, ఎస్సై రాజేందర్, ఏఎస్సై సత్యనారాయణ, హెడ్‌ కానిస్టేబుళ్లు రమేష్, వెంకట్రాం, కానిస్టేబుళ్లు రాజ్‌కుమార్, నాగరాజు, లింగమూర్తి, రాజశేఖర్, శ్రీనివాస్, సైబర్‌ క్రైం కానిస్టేబుల్‌ కిషోర్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి అభినందించారు.

చదవండి: వైరల్‌: కరోనా టెస్టుకు సిగ్గుపడిన కొత్త పెళ్లి కూతురు

కవలల విషాదం: అమ్మా నువ్వేదో దాస్తున్నావ్‌ చెప్పు.. అంతలోనే

>
మరిన్ని వార్తలు