విడాకులిచ్చిందని 27 సార్లు కత్తితో పొడిచి మరీ హతమార్చాడు

6 Aug, 2021 01:08 IST|Sakshi

అహ్మదాబాద్‌: తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్న ఓ మహిళను ఆమె మాజీ భర్త అత్యంత కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఆ మహిళ రెండో భర్త ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అహ్మదాబాద్‌లోని వత్వా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. అజయ్ ఠాకూర్ అనే వ్యక్తి హేమ అనే మహిళ కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహమైన కొన్నాళ్లు ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అయితే కొన్నాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త ప్రవర్తనతో విసుకు చెందిన హేమ అతడిని దూరం పెట్టింది. ఇద్దరి మధ్య తరచూ మనస్పర్థలు తలెత్తాయి. ఇక ఇదే క్రమంలో.. హేమ తనకు పరిచయమైన మహేష్ ఠాకూర్ అనే యువకుడితో చేసిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. దీంతో హేమ తన భర్త అజయ్ ఠాకూర్‌కు విడాకులిచ్చింది.

అంతేకాక వారి ఇద్దరు పిల్లలని కూడా అజయ్ ఠాకూర్‌ వద్దే ఉంచింది. ఆ తర్వాత మహేష్‌ ఠాకూర్‌ను పెళ్లి చేసుకుని అతనితోనే కలిసి ఉంటోంది. ఇక భార్య దూరమైనప్పటి నుంచి అజయ్ ఠాకూర్ మానసికంగా కుంగిపోయాడు. తన ఇద్దరు పిల్లలను భార్య వదిలి వెళ్లడంతో వారిని ఎలా చూసుకోవాలో తెలియక మదనపడుతూ మద్యానికి బానిసయ్యాడు. తనకు ఇలాంటి దుస్థితిని తీసుకొచ్చిన భార్యపై పగ పెంచుకున్న అజయ్ ఠాకూర్ హేమను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం కొంత కాలం ఎదురుచూడసాగాడు. తన స్నేహితులతో కలిసి పక్కా ప్రణాళిక రచించాడు.

బుధవారం రాత్రి అజయ్ ఠాకూర్ తన ఇద్దరి స్నేహితులను వెంటబెట్టుకుని హేమ, మహేష్ ఠాకూర్ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. మహేష్ ఠాకూర్ ఇంట్లో లేకపోవడంతో అజయ్ ఠాకూర్ హేమపై కత్తితో ఒక్కసారిగా దాడిచేశాడు. అజయ్ ఠాకూర్ దాడికి భయంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన హేమను అతని స్నేహితులు అడ్డుకున్నారు. చివరికి హేమను వెంటాడి మరీ అత్యంత కిరాతకంగా 27సార్లు కత్తితో పొడిచి చంపాడు. హేమ మరణించిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి అజయ్ ఠాకూర్ అతని స్నేహితులు పరారయ్యారు. ఇదంతా జరిగిన కాసేపటికి హేమ రెండో భర్త మహేష్ ఠాకూర్ ఇంటికొచ్చాడు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న తన భార్య హేమను చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు