బావా బావమరుదుల కొట్లాట.. మధ్యలో వచ్చిన మామ హతం

7 Jul, 2021 08:58 IST|Sakshi
మృతి చెందిన షేక్‌ సుభాని

చిలకలూరిపేట(గుంటూరు జిల్లా): స్థల వివాదం నేపథ్యంలో అల్లుడి చేతిలో మామ హతమైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. అర్బన్‌ సీఐ షేక్‌ బిలాలుద్దీన్‌ కథనం ప్రకారం పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన షేక్‌ సుభాని బైక్‌ మెకానిక్‌. అతను తనకు పిల్లనిచ్చిన మామ షేక్‌ సుభాని(68) ఇంటి సమీపంలో ఖాళీ స్థలం కొన్నాడు. సెంట్‌మెంటు ప్రకారం ఇది సరికాదని సుభాని బావమరిది షేక్‌ జానీబాషా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో సోమవారం సుభాని స్థలాన్ని శుభ్రం చేయించాడు.

దీంతో రాత్రి 11 గంటల సమయంలో బావా బావమరుదులు కొట్లాటకు దిగారు. వీరిద్దరినీ విడదీసే క్రమంలో మామ సుభాని అడ్డువెళ్లాడు. దీంతో మామపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మామ సుభాని అక్కడికక్కడే మృతి చెందాడు.  ఘటనలో బావా బావమరుదులైన సుభాని, జానీబాషా కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సుభాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు