మాజీ భార్యపై పగ తీర్చుకోవటానికి సొంత బిడ్డల్ని..

14 Jun, 2021 20:53 IST|Sakshi
ఆనా, ఒలివియా

మాడ్రిడ్‌ : తనతో గొడవపడి విడిపోయిన మాజీ భార్యకు అంతులేని దుఖం మిగల్చాలనే కోపంతో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. సొంత బిడ్డలనే కిరాతకంగా హత్య చేసి సముద్రంలో పడేశాడు. ఈ సంఘటన స్పెయిన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్పెయిన్‌లోని టెనెరిఫేకు చెందిన జిమ్మర్‌మ్యాన్‌ భర్త థామస్‌ జెమినోతో విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలు ఆనా, ఒలీవియాతో కలిసి ఉంటోంది. గత ఏప్రిల్‌ నెలలో ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత గురువారం సముద్రంలో 3000 అడుగుల లోతులో.. స్పోర్ట్స్‌ బ్యాగులో ఒలీవియా మృతదేహం లభ్యమైంది. ఆనా ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ చిన్నారి కూడా చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆనా, ఒలీవియాల మరణానికి కారణం పిల్లల తండ్రి జెమినోనే అని తేలింది. మాజీ భార్యకు అంతు లేని దుఖాన్ని మిగల్చటానికి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది.

దీనిపై జిమ్మర్‌మ్యాన్‌ స్పందిస్తూ.. ‘‘ఆనా,ఒలీవియాను నేను ఎంతో ప్రేమించాను. ప్రతీ రోజూ వారికి అన్ని విషయాలు చెప్పేదాన్ని. నేను వాళ్లతో పాటు కలిసి చావాల్సింది. పిల్లలు మన బాధ్యత, వాళ్లను బ్రతికించుకోలేకపోయినందుకు నా మనసు క్షోభిస్తోంది. కనిపించకుండా పోయిన నా పిల్లలను వెతుక్కుంటూ నేను నా జీవితాంతం గడపాలని నా మాజీ భర్త ఈ దారుణం చేశాడు. మన ప్రపంచానికి ఓ గుణపాఠం చెప్పటానికి భూమ్మీదకు వచ్చి ప్రాణాలు వదులుకున్న ఏంజిల్స్‌ నా కూతుళ్లు’’ అని ఏర్కొంది.
 

మరిన్ని వార్తలు