పెళ్లి చేసుకోమంటోందని ప్రియురాలిపై దారుణం

29 Jul, 2021 07:56 IST|Sakshi
సుస్మితా ఖడంగా.. ప్రియుడు కృష్ణచంద్ర సాహుతో మృతురాలు(ఫైల్‌)

భువనేశ్వర్‌ : జీవితంపై ఆశలు పోసిన వాడే ఊపిరి తీశాడు. అగ్ని సాక్షిగా ఏడు అడుగులు కలిసి నడుద్దామని నమ్మబలికి.. చివరికి పెట్రోల్‌ పోసి, కాటికి పంపాడు. సర్వం తానై అనుకున్న ప్రియురాలి ప్రాణం తీశాడు. గంజాం జిల్లా పురుసోత్తపురం బ్లాక్‌లో ప్రియురాలిపై ప్రియుడే పెట్రోల్‌ పోసి నిప్పంటిన ఘటన.. జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంజాం ఎస్పీ భ్రజేష్‌కుమార్‌ రాయ్‌ తెలిపిన వివరాల ప్రకారం... పురుసోత్తపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధి పత్తపూర్‌ గ్రామానికి చెందిన యువకుడు కృష్ణచంద్ర సాహు(30), కభిసూర్యనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని జొలంబో గ్రామానికి చెందిన యువతి సుస్మితా ఖడంగా(25) బరంపురం కళాశాలలో మూడేళ్లు కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. సుస్మితాను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన కృష్ణచంద్రా.. ఆ పేరుతో ఆమెను లైంగికంగా దగ్గర చేసుకున్నాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని యువతి తరచూ ఒత్తిడి తేవడంతో ఆమెను శాశ్వతంగా అడ్డు తొలంగించు కొనేందుకు పధకం పన్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుస్మితను తన గ్రామానికి తీసుకు వెళ్లాడు.

అనంతరం పరిచయస్తుల ఇంట్లో ఆమెపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించాడు. మంటలను గమనించిన చుట్టుపక్కల వాళ్లు అందించిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే యువతి 80శాతం కాలిన గాయాలతో పడి ఉంది. తొలుత పురుసోత్తపురం ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం సుస్మిత మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరారైన నిందితుడు కృష్ణచంద్ర సాహుని పురుసోత్తపురం పోలీసులు అరెస్ట్‌ చేసి, విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు