స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలియడంతో

5 Jan, 2022 18:39 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. హతుడు నగరంలో చాలామందికి సుపరిచితుడు కావడంతో ఈ హత్య సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌నగర్‌కు చెందిన సీహెచ్‌ సునీల్‌ కాళేశ్వరి ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య స్థానిక ఒక కార్పొరేట్‌ స్కూలులో ప్రిన్సిపాల్‌గా పని చేస్తోంది. అందరితో కలివిడిగా, స్నేహపూర్వకంగా ఉండటంతో నగరంలోని ప్రముఖులతో సునీల్‌కు పరిచయాలున్నాయి. సునీల్‌ కుటుంబానికి బొమ్మూరుకు చెందిన డెన్మర్‌ అనే వ్యక్తి కుటుంబానికి చాలాకాలంగా స్నేహం ఉంది. ఉద్యోగ రీత్యా డెన్మర్‌ అబుదాబీలో ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో సునీల్‌కు, డెన్మర్‌ భార్యకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలియడంతో డెన్మర్‌ ఈ వ్యవహారంపై ఆరా తీశాడు. ఈ నేపథ్యంలో అతడు వారం రోజుల క్రితం రాజమహేంద్రవరంలోని బొమ్మూరు ప్రాంతంలోని తన ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచీ భార్యకు, డెన్మర్‌కు, సునీల్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం సునీల్‌ భార్య యథావిధిగా డ్యూటీకి వెళ్లిపోయింది. ఇంట్లో సునీల్‌ ఒంటరిగా ఉన్నాడు. కొంతసేపటికి ఆ ఇంటికి డెన్మర్, అతడి భార్య చేరుకున్నారు. అక్కడ ముగ్గురి మధ్య గంట పైగా వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. వారు తిరిగి వెళ్లిన కొద్దిసేపటికి సునీల్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 
చదవండి: కూకట్‌పల్లిలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్.. మహిళను ఫాలో అవుతూ..

ఇంట్లో కేకలు వినిపించడంతో అక్కడకు వెళ్లిన స్థానికులు సునీల్‌ పరిస్థితిని గమనించి అతడి భార్యకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన స్థానిక ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న ప్రకాశ్‌ నగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. హత్యపై స్థానికులను ఆరా తీశారు. హతుడి దేహంపై మెడకు ఇరువైపులా, ఛాతి పైనా కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన కత్తిని హంతకులు అక్కడే పడేయడంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: వికటించిన ఆర్‌ఎంపీ వైద్యం.. 20 రోజుల నరకయాతన.. చివరికి

సునీల్‌ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న డెన్మర్, అతడి భార్యను బొమ్మూరులోని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. డెన్మర్‌ భార్య చేతిపై కూడా కత్తి గాయాలున్నాయని చెబుతున్నారు. బహుశా సునీల్‌ను హతమార్చేందుకు డెన్మర్‌ ప్రయత్నించినప్పుడు అతడి భార్య అడ్డుకొనేందుకు ప్రయత్నించి ఉంటుందని, ఆ క్రమంలోనే ఆమెకు కూడా కత్తి గాయాలయ్యాయని అనుమానిస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు