భార్యను చంపి లోయలో పడేశాడు..

4 Mar, 2021 08:10 IST|Sakshi
ఘటనా స్థలం వద్ద పరిశీలిస్తున్న సీఐ అప్పలనాయుడు,ఎస్‌ఐ కృష్ణమూర్తి, (ఇన్‌సెట్లో) ఎర్రమ్మ(ఫైల్‌ ఫొటో)

భార్యను హత్యచేసి లోయలో పడేసిన వైనం 

విజయనగరం : బంధువుల ఇంటికి భర్తతో వెళ్లిన ఓ వివాహిత నాలుగు రోజుల అనంతరం లోయలో మృతదేహమై కనిపించింది. భర్తే హతమార్చాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామభద్రపురం మండలం మూలసెలగాం గ్రామానికి చెందిన బారిసిన పోకలయ్య కుమార్తె ఎర్రమ్మ(30)ను అదే గ్రామానికి చెందిన ఎన్నికల పెంటయ్యకిచ్చి కొన్నాళ్ల క్రితం వివాహం చేశాడు. వారికి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. పెంటయ్య వ్యసనపరుడు కావడం... వేరే మహిళతో సంబంధం కొనసాగిస్తుండటం.. తరచూ మద్యం సేవిస్తుండటంతో భార్యా, భర్తల మధ్య తరచూ వివాదం జరుగుతుండేది. ఈ నేపథ్యంలో పెంటయ్య తన భార్యను తీసుకుని గత నెల 24వ తేదీన పాచిపెంట మండలం కొండతాడూరులోని బంధువుల ఇంటికి వెళ్దామని తీసుకెళ్లాడు. కుమార్తెనున ఇంట్లోనే వదిలి వెళ్లి నాలుగు రోజులవుతున్నా ఇంటికి రాకపోవడంతో ఆ గ్రామానికి వెళ్లి వాకబు చేయగా వారు అసలు రాలేదని చెప్పారు. తీరా మంగళవారం మధ్యాహ్నం పెదసెలగాం గ్రామానికి చెందిన పశువుల కాపరి దిబ్బగుడ్డి పరిసరాల్లో పశువులను మేపుతుండగా పక్కనే లోయలో ఓ మృత దేహం కనిపించింది.

దగ్గరకెళ్లి పరిశీలించగా ఎర్రమ్మ అని గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అదే రోజు సాయంత్రం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా హత్య జరిగి వారం రోజులు పైబడే ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని తరలించడానికి వీలుకాని పరిస్థితిలో ఉండటంతో బుధవారం ఉదయం సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ కృష్ణమూర్తి బాడంగి సీహెచ్‌సీ వైద్యాధికారితో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన అల్లుడు రోజూ తాగేసి వచ్చి భార్యపై అనుమానంతో కొట్టేవాడనీ, అతడే తన కూతురును హత్య చేసి లోయలో పడేశాడని తల్లి కన్నమ్మ, తండ్రి పోకలయ్య పోలీసులకు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు