మనువాడమన్నందుకు.. మట్టుబెట్టాడు 

25 Aug, 2021 09:33 IST|Sakshi
యశోద (ఫైల్‌)

కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను వదిలేసి ఆమె ప్రియుడి వెంట వచ్చేసింది. వారిద్దరూ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చారు. ఇలా ఎంతకాలం.. నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆమె తన మనసులోని మాటను ప్రియుడి ముందు చెప్పింది. అంతే.. ఆమెను వదిలించుకోవాలని పథకం పన్ని.. నిద్రిస్తున్న సమయంలో హతమార్చాడు. 

కడప అర్బన్‌: ఆంధ్ర పదేశ్‌లోని కడప నగరం చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దేవుని కడపలో నివాసం ఉంటున్న యశోద(29) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటనపై చిన్నచౌక్‌ పోలీసులు, మృతురాలి సోదరి గోవిందమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవుని కడపకు చెందిన యశోద గత నాలుగేళ్లుగా మాసాపేటకు చెందిన నిత్యపూజయ్య అలియాస్‌ సురేష్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కాగా, మృతురాలికి పదేళ్ల క్రితం జయశంకర్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కలిగి ఉందనే కారణంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగి విడిపోయారు. పిల్లలు భర్త జయశంకర్‌ వద్దే ఉన్నారు.

చదవండి: ప్రియుడితో సహజీవనం.. వేధింపులతో..


ఈ క్రమంలోనే నిత్యపూజయ్య అలియాస్‌ సురేష్, యశోదలు గత నాలుగేళ్లుగా దేవునికడపలోని ఓ ఇంటిలో సహజీవనం చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆమె తనను వివాహం చేసుకోవాలని నిత్యపూజయ్యను అడుగుతోంది. ఈ విషయమై పరస్పరం గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ సోమవారం రాత్రి యశోద మంచంపై పడుకుని ఉన్న సమయంలో నిత్యపూజయ్య దిండును ఆమె తలపై పెట్టి ఊపిరాడకుండా చేసి, హత్య చేశాడు. తరువాత ఇంటికి తాళం వేసి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం వరకు తనకు ఫోన్‌ చేయకపోవడం, ఎలాంటి సమాచారం లేకుండా పోయేసరికి, మృతురాలి చెల్లెలు గోవిందమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లింది. అనుమానం వచ్చి స్థానికుల సహకారంతో  తాళం పగులగొట్టించింది. తన అక్క మంచంపై విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలాన్ని  ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి పరిశీలించారు. ఈమేరకు  కేసు నమోదు చేశారు.

చదవండి: సోఫా కొంటామని రూ. 63 వేలకు టోకరా

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు