దారుణం: తిట్టాడని సిమెంట్‌ ఇటుకతో తలపై బాది..  

18 May, 2021 07:10 IST|Sakshi
మృతుడు శ్యాంసుందర్‌(ఫైల్‌), నిందితుడు నవీన్‌

నేరేడ్‌మెట్‌:  ఆ ఇద్దరు కలిసి తిరుగుతుంటారు.. కలిసే మద్యం తాగుతుంటారు.. ఆ సమయంలో బూతులు తిట్టుకుంటారు.. కానీ ఆ బూతులు నచ్చకపోవడంతో స్నేహితుడినే హత్య చేసిన ఘటన నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహస్వామి వివరాల ప్రకారం.. ఈస్ట్‌ కృపా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రెవేట్‌ ఉద్యోగి ఎం.శ్యాంసుందర్‌(31), చైనాబజార్‌ సమీపంలోని విజయ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న డ్రైవర్‌ పుల్గం నవీన్‌(33) రెండేళ్లుగా స్నేహితులు.

ఇద్దరూ కలిసి తరచూ మద్యం తాగుతుంటారు. ఆ సమయంలో శ్యాంసుందర్‌ నవీన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను బూతులు తిడుతుంటాడు. దీంతో నవీన్‌ అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరూ కలిసి నవీన్‌ ఇంట్లోనే మద్యం తాగారు.  అనంతరం శ్యాంసుందర్‌ ఇంటికి వెళ్లిపోయాడు.  

సిమెంట్‌ ఇటుకతో తలపై బాది..  
కుటుంబ సభ్యులను తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన నవీన్‌ అతడి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అనంతరం కర్రతో దాడి చేశాడు. శ్యాంసుందర్‌ తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆమెను తోసేశాడు. పక్కనే ఉన్న సిమెంట్‌ ఇటుకతో శ్యాంసుందర్‌ తలపై బాది వెళ్లిపోయాడు. వెంటనే తల్లి 100కు డయల్‌ చేయగా నేరేడ్‌మెట్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే అతడు మృతి చెందాడని అంబులెన్స్‌ సిబ్బంది చెప్పారు. ఘటన స్థలాన్ని కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్‌స్పెక్టర్‌ నర్సింహస్వామి, క్రైం పార్టీ బృందాలు సందర్శించి ఆధారాలు సేకరించారు. నిందితుడు నవీన్‌ను అరెస్టు చేసినట్టు, మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. 
చదవండి: డూప్లెక్స్‌ ఇంట్లో అగ్నిప్రమాదం 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు