వీడిన మిస్టరీ.. బావే హంతకుడు.. అత్త ఆస్తి కోసం..

4 Aug, 2022 08:04 IST|Sakshi
హతుడు అఖిల్‌ (ఫైల్‌), హంతకుడు అనిల్‌ (ఫైల్‌)

కంబదూరు(అనంతపురం జిల్లా): అన్నదమ్ములు కీడెంచితే.. బావ మంచి కోరతాడనేది నానుడి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరిగింది. ఆస్తి కోసం బావమరిదిని బావే హత్య చేసి, ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టాడు. రెండున్నర నెలల తర్వాత అసలు విషయం వెలుగు చూసింది.  కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

ములకనూరు గ్రామానికి చెందిన దండా శారదమ్మకు అఖిల్‌(15) అనే కుమారుడితో పాటు వర్షిత, త్రిష అనే ఇద్దరు కుమారై లు ఉన్నారు. అఖిల్‌ గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పెద్ద కుమార్తె వర్షితకు ఎనిమిది నెలల క్రితం గుద్దెళ్ల గ్రామానికి చెందిన అనిల్‌తో వివాహమైంది.
చదవండి: కామంతో కళ్లు మూసుకుపోయి.. వావి వరసలు మరిచిపోయి..

అనిల్‌ తన భార్యతో కలసి అత్తారింట్లోనే ఉంటున్నాడు. గ్రామంలో శారదమ్మకు 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అనిల్‌కు ఆ భూమిపై కన్ను పడింది. శారదమ్మ ఏకైక కుమారుడైన అఖిల్‌ను అడ్డు తొలగించుకొంటే భూమి తన సొంతమవుతుందని భావించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 21న ములకనూరులో జరిగిన తిమ్మప్ప జాతర సందర్భంగా అఖిల్‌కు సెల్‌ ఫోన్‌ తీసిస్తానని నమ్మించి బైక్‌లో ఎక్కించుకుని గుద్దెళ్ల సమీపంలోని తన వ్యవసాయ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ కొడవలి, కర్రతో దాడి చేసి చంపేసి, తర్వాత డ్రిప్‌ వైర్‌తో శరీరాన్ని బిగించి సమీపంలోని వంకలో పూడ్చిపెట్టాడు.

రోదిస్తున్న అఖిల్‌ తల్లి, బంధువులు  

మరుసటి రోజు తన కుమారుడు కన్పించలేదని అఖిల్‌ తల్లి శారదమ్మ కంబదూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ రాజేష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనిల్‌ నెల రోజులుగా కన్పించకుండా పోవడంతో పాటు ఆ రోజు అఖిల్‌ను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిన విషయం తెలిసి శారదమ్మకు అల్లుడిపై అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. బుధవారం కదిరిదేవరపల్లి రైల్వే స్టేషన్‌లో అనిల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు.

అత్త భూమి కోసం తానే  బావమరిదిని చంపి పూడ్చివేశానని అంగీకరించాడు. దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రాజేష్‌ అతన్ని తీసుకొని అఖిల్‌ను పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లి తహసీల్దార్‌ నయాజ్‌ అహ్మద్‌ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో అక్కడే డాక్టర్లు శ్రీనివాసునాయక్, రా«ధ పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత నిందితున్ని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు.

కన్నీరుమున్నీరైన తల్లి.. 
‘నా వద్దే కూతురు, అల్లుడిని పెట్టుకుని సంసారమంతా చూసుకుంటిని. ఉన్న ఒక్కగానొక్క నా కొడుకును ఇంతా దారుణంగా చంపడానికి చేతులెలా వచ్చాయిరా? ఇన్ని రోజులు చెప్పకుండా ఎంత బాగా నటించావురా!’  అంటూ అఖిల్‌ తల్లి శారదమ్మ గుండెలవిసేలా రోదించింది. ‘ఇలాంటి వాడిని వదలొద్దండి సార్‌.. చంపేయండి’ అంటూ పోలీసులను వేడుకోవడం అక్కడున్న వారందరినీ కలచి వేసింది. 

మరిన్ని వార్తలు