సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఇంట్లో షాకింగ్‌ ఘటన.. తలుపు తట్టి.. నెట్టుకు వచ్చి..

20 Dec, 2022 08:40 IST|Sakshi
దాడిలో గాయపడ్డ ప్రియాంక

అమలాపురం టౌన్‌(కోనసీమ జిల్లా): సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై ఓ ఆగంతకుడు చాకులతో దాడి చేసిన ఘటన అమలాపురం పట్టణంలో కలకలం రేపింది. పోతీసులు, బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం వీధిలో నివసిస్తున్న నందెపు రామాంజనేయులు కుమార్తె సూర్యప్రియాంక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆమె భర్త విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. నాలుగు నెలల బాలింతరాలు కావడంతో ఆమె చంటిబిడ్డతో అమలాపురంలోని పుట్టింట్లోనే ఉండి ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది. బిడ్డకు అస్వస్థతగా ఉండటంతో ప్రియాంక ఆదివారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చింది.

రాత్రి 9 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ప్రియాంక తలుపు తెరిచింది. అంతలోనే ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు వేసుకుని, రెండు చేతుల్లో రెండు చాకులు పట్టుకుని ఉన్న దుండగుడు ఒక్కసారిగా తలుపు నెట్టి.. ఇంట్లోకి చొరబడి, ఆమెపై దాడికి ఒడిగట్టాడు. రక్షణ కోసం అడ్డం పెట్టుకున్న చేతులపై చాకులతో పొడిచి బలంగా గాయపరిచాడు. ఈ హఠాత్పరిణామంతో హడలిపోయిన ప్రియాంక భయంతో పెద్ద పెట్టున కేకలు వేస్తూ తండ్రి ఉన్న గదిలోకి వెళ్లింది.

అంతలోనే ఆ ఆగంతకుడు తన చేతిలోని రెండు చాకులను అక్కడే వదిలేసి, ఇంటి గోడ దూకి పరారయ్యాడు. చేతులకు తీవ్ర గాయాలైన ప్రియాంకను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో అమ్మ, తాను మాత్రమే ఉన్నామనుకుని ఆ ఆగంతకుడు చోరీకి వచ్చాడని ప్రియాంక పోలీసులకు చెప్పింది. తన తండ్రి ఇంట్లో ఉండబట్టే తాను, తన తల్లి బతికామని, లేకపోతే తమను చంపేసి నగలు దోచుకునేవాడని ఆమె కన్నీటిపర్యంతమైంది.
చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగింది?

ఆ దుండగుడు చోరీకి విఫలయత్నం చేసి, ఈ దాడికి పాల్పడడ్డాడని రామాంజనేయులు కూడా చెబుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుడు వదిలేసిన చాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుడు చోరీకి వచ్చాడా.. తెలిసున్న వ్యక్తే ఈ దాడికి ఒడిగట్టాడా.. మతిస్థిమితం లేక ఇలా ప్రవర్తించాడా అనే కోణాల్లో బాధిత కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

పట్టణ ఎస్సై ప్రభాకర్, హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్బరాజు ఆ ఇంటిని సోమవారం బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. ఆ వీధిలో ఉన్న సీసీ ఫుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ దాడి ఏ కారణంతో జరిగిందో దర్యాప్తు అనంతరం స్పష్టత వస్తుందని ఎస్సై ప్రభాకర్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు