కత్తి దూసిన కక్ష..తల్లీ కొడుకులపై హత్యాయత్నం

13 Aug, 2021 07:40 IST|Sakshi

వీరఘట్టం: పాత కక్షల నేపథ్యంలో తల్లీ కొడుకులపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుకూరు ఎస్సీ కాలనికి చెందిన తల్లీకుమారులు నిడగంటి రూపావతి, జనార్దనరావులకు అదే వీధికి చెందిన మామిడి ఈశ్వరరావుతో పాతకక్షలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వీరఘట్టం వెళ్లి ఇంటికి వస్తున్న జనార్దనరావుపై ఈశ్వరరావు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ విషయాన్ని గమనించిన రూపావతి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేయడంతో చేతులకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను వీరఘట్టం పీహెచ్‌సీకి తరలించి ప్రథమచికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నడుకూరు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు