కృష్ణాజిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లి, ముగ్గురు కూతుళ్లపై కత్తితో దాడి..

16 Jul, 2022 12:23 IST|Sakshi
గాయాల పాలైన యువతి, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

కృష్ణా: తన ప్రేమని తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనా విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్‌ఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. మొవ్వ అంబేద్కర్‌ నగర్‌కు చెందిన బల్లారపు నాగరాజ్యంకు ముగ్గురు కుమార్తెలు. భర్త నాగేశ్వరరావు 2013లో మృతి చెందాడు. 22 ఏళ్ల పెద్ద కుమార్తెను అదే కాలనీకి చెందిన నాగదేసి జోయల్‌ సంవత్సర కాలంగా ప్రేమించమంటూ వేధిస్తున్నాడు.

ఆమె తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో గురువారం రాత్రి కత్తి తీసుకుని యువతి ఇంటికి వచ్చాడు. ముందుగా ఇంటి బయట ఉన్న ఆమె చిన్న సోదరిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి చొరబడి తల్లి, మరో సోదరిపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగు రావడంతో జోయల్‌ పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత కుటుంబాన్ని స్థానికులు హుటాహుటిన మొవ్వ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

నిందితుడు అరెస్టు 
పామర్రు: తనను ప్రేమించలేదనే కక్షతో యువతిని ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసిన నిందితుడు జోయల్‌ను అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచామని గుడివాడ డీఎస్పీ సత్యానంద్‌ పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిపై కూచిపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కూచిపూడి ఎస్‌ఐ కె.దుర్గాప్రసాద్‌ బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వారి స్టేట్మెంట్‌ రికార్డు చేశారని చెప్పారు. మొవ్వ జేఎఫ్‌సీఎం, కోర్టు వారి వద్ద రిమాండ్‌ నిమిత్తం హాజరు పరిరామన్నారు.  

మరిన్ని వార్తలు