అమ్మమ్మ, మనవడు నిద్రిస్తున్న గదికి గొళ్లెం పెట్టి.. యువతిపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో

5 Apr, 2022 17:02 IST|Sakshi

కాళ్ల (పశ్చిమ గోదావరి): యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఓ మృగాడికి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో ఆమెను నేలకేసి కొట్టిచంపిన కిరాతక ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పల్లిపాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్పాల కల్యాణి (19) తన అమ్మమ్మ ఒడుగు దుర్గ వద్ద ఉంటోంది. కల్యాణి తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లింది. నెలసరి కావడంతో కల్యాణి ఆదివారం రాత్రి ఇంట్లోని ఓ గదిలో నిద్రించగా.. ఆమె అమ్మమ్మ దుర్గ మనవడితో కలసి మరో గదిలో నిద్రించింది.

చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్‌.. పెళ్లైన రెండు వారాలకే..

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అదే గ్రామానికి చెందిన తిరుమల సాయిప్రసాద్‌ అలియాస్‌ నాని అనే యువకుడు ఆ ఇంట్లోకి ప్రవేశించి దుర్గ, ఆమె మనుమడు నిద్రిస్తున్న గదికి గొళ్లెం పెట్టాడు. ఆ తరువాత కల్యాణి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అతడిని ప్రతిఘటించిన కల్యాణి కేకలు వేస్తూ పక్క గదిలో నిద్రిస్తున్న అమ్మమ్మను పిలవటంతో నిందితుడు సాయిప్రసాద్‌ ఆమె తలను నేలకేసి కొట్టి హతమార్చాడు.

మనవరాలి కేకలు విని నిద్రలేచిన దుర్గ తన గదిలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపులకు గొళ్లెం పెట్టి ఉండటంతో బయటకు రాలేక బిగ్గరగా అరిచింది. ఆ అరుపులు విని చుట్టపక్కల ఇళ్లల్లోని వారు వచ్చి తలుపులు తెరిచారు. పక్కగదిలోకి వెళ్లి చూడగా కల్యాణి రక్తపు మడుగులో నిర్జీవంగా పడివుంది. నిందితుడు సాయిప్రసాద్‌ మృతురాలి ఇంటినుంచి పారిపోవడం తాను చూసినట్టు స్థానికుల్లో ఒకరైన వైధాని దుర్గారావు చెప్పాడని కల్యాణి అమ్మమ్మ దుర్గ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

నిందితుడు టీడీపీ నేత కుమారుడు
నిందితుడు సాయిప్రసాద్‌ టీడీపీ నేత తిరుమల భాస్కరరావు పెద్ద కుమారుడు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. కాగా, నిందితుడు సాయిప్రసాద్‌ 9 నెలల క్రితం కూడా ఓ యువతిపై ఇదే తరహాలో అఘాయిత్యానికి ఒడిగట్టాడని గ్రామస్తులు తెలిపారు.  

రాజీకి యత్నం.. రంగంలోకి పోలీసులు
ఈ ఘటనపై గ్రామ పెద్దలు రాజీ కుదిర్చి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇవ్వటంతో కాళ్ల పోలీసులు శ్మశాన వాటిక వద్దకు చేరుకుని దహన సంస్కారాలను అడ్డుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భీమవరంలోని ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. ఎస్పీ రవిప్రకాష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో క్లూస్‌ టీమ్‌ వివరాలు సేకరించింది. సాయిప్రసాద్‌పై కేసు నమోదు చేశామని, నిందితుడు పరారిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు