నెహ్రూ జూలాజికల్‌ పార్కు: సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని...

24 Nov, 2021 13:32 IST|Sakshi
సింహం ఎన్‌క్లోజర్‌లోకి వచ్చిన సాయికుమార్‌ 

మతిస్థిమితం లేక జూపార్కులో హల్‌చల్‌ చేసిన యువకుడు  

అప్రమత్తమై వెనక్కి తీసుకొచ్చిన జూ సిబ్బంది.. పోలీసులకు అప్పగింత

బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్‌ పార్కులో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. నేరుగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి దిగే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన సందర్శకుడు అరవడంతో అప్రమత్తమైన జూ సిబ్బంది చాకచాక్యంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు జరిగింది. జూ అధికారులు, బహదూర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయి కుమార్‌ (31) జూపార్కును సందర్శించడానికి టికెట్టు తీసుకొని జూలోకి వెళ్లాడు.

తోటి సందర్శకులు, జూ సిబ్బంది కళ్లు కప్పి సింహం ఎన్‌క్లోజర్‌ కొండచరియల గోడపైకి ఎక్కాడు. దీంతో అప్రమత్తమైన జూ యానిమల్‌ కీపర్, సిబ్బంది అతడిని పట్టుకున్నారు. సాయి కుమార్‌ తిరుమలగిరి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా రోడ్లపై నివాసముంటున్నట్లు బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ పేర్కొన్నారు. సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని... వాటి కోసమే సింహం దగ్గరకు వెళ్లానని చెప్పాడని, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు పేర్కొన్నారు. సాయి కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

దాడికి సన్నద్ధమైన సింహం... 
ఆసియా సింహాల ఎన్‌క్లోజర్‌ గోడ మీదికి ఎక్కిన యువకున్ని ఎన్‌క్లోజర్‌లో ఉన్న సింహం (మనోహర్‌–7) చూసింది. యువకుడు ఏ మాత్రం కిందికి దిగినా... అదును చూసుకుని దాడి చేసేందుకు సింహం సన్నద్ధమైంది. యువకుడినే గమనిస్తూ తన డెన్‌ ముందు అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. జూ సిబ్బంది చాకచాక్యంగా వ్యవహరించకపోతే ఆ సింహం చేతిలో యువకుడు సాయి కుమార్‌ మృత్యువాత పడాల్సి వచ్చేది. యువకుడు సురక్షితంగా బయటపడటంతో జూ సిబ్బంది, అధికారులు, సందర్శకులు ఊపిరి పీల్చుకున్నారు.  

గతంలోనూ... 
నగరంలోని మెట్రో రైలు పనుల్లో కార్మికుడిగా పని చేస్తున్న ఓ యువకుడు 2016లో తాగిన మత్తులో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దిగాడు. ఎన్‌క్లోజర్‌ చుట్టు ఉండే నీటిలో ఈత కొట్టుకుంటూ సింహం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది, అధికారులు గంట పాటు శ్రమించి అతన్ని బయటికి తీసుకొచ్చారు. రాజస్తాన్‌కు చెందిన అతనిపై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ యువకుడు నాలుగు నెలల వరకు జైలు పాలయ్యాడు. 

మరిన్ని వార్తలు