చంపి.. సంచిలో కట్టి.. చెరువులో పడేసి

30 Dec, 2020 09:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కిరాతకంగా యువకుడి హత్య

తల, మొండెం వేరు చేసిన దుండగులు

ఈనెల 15న ఇతడి అదృశ్యంపై బొమ్మూరు స్టేషన్‌లో కేసు

భూపాలపట్నం చెరువులో మృతదేహం లభ్యం

సాక్షి, రాజానగరం: బొమ్మూరు పోలీసు స్టేషనులో వ్యక్తి అదృశ్యం కేసుగా నమోదైన యువకుడు మండలంలోని భూపాలపట్నం చెరువులో శవమై తేలాడు. తల, మొండెం వేరుచేయబడి ఉన్న ఈ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం ఉదయం చూసి వీఆర్వో కాళ్ల మోహనరావు ద్వారా రాజానగరం పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యక్తిగత కక్షలో, మరో కారణమో తెలియదుగానీ ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అమానుషంగా నరికి, సిమెంటు సంచిలో వేసి మూట కట్టి చెరువులో పడవేశారు. అయితే మూట కట్టు విడిపోయి, సంచెలో నుంచి కాళ్లు బయటకు వచ్చి నీటిపై తేలడంతో స్థానికుల ద్వారా బయటపడింది.

ఈ సంఘటన వివరాలను మంగళవారం రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. భూపాలపట్నం శివారులోని చెరువులో తేలిన ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం శాంతిపురానికి చెందిన రొంగలి దుర్గాప్రసాద్‌(22)గా గుర్తించారు. అవివాహితుడైన ఆ యువకుడు ఈనెల 13న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని అతడి తండ్రి వీరబాబు ఈనెల 15న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో విరోధులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వేరొక ప్రాంతంలో హత్య చేసి, ఆపై తలను, మొండేన్ని వేరుచేసి, సంచిలో మూట కట్టి, ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని తెలిపారు. చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీసి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును బొమ్మూరు, రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల, మొండెం వేరు చేసి ఉన్న మృతదేహం   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు