జడ్జినే బెదిరించాడు!

10 Mar, 2023 05:33 IST|Sakshi

జైపూర్‌: మార్ఫ్‌డ్‌ ఫొటోలను పంపి రూ.20 లక్షలివ్వకుంటే వాటిని బయటపెడతామంటూ మహిళా జడ్జిని బెదిరించిన ఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆగంతకుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఓ మహిళా జడ్జికి ఫిబ్రవరి 7న ఒక పార్సిల్‌ వచ్చింది. జడ్జి పిల్లలు చదివే స్కూలు నుంచి వచ్చిందంటూ ఓ అగంతకుడు పార్సిల్‌ను కోర్టు స్టెనోగ్రాఫర్‌కు ఇచ్చాడు. పేరు అడగ్గా చెప్పకుండానే వెళ్లిపోయాడు. ఆ పార్సిల్‌లో కొన్ని స్వీట్లతోపాటు అభ్యంతరకరంగా ఉన్న జడ్జి ఫొటోలు కనిపించాయి.

రూ.20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి పరువు తీస్తాననే హెచ్చరికతో కూడిన ఉత్తరం ఉంది. జడ్జి చాంబర్‌లోని సీసీ కెమెరాలో ఓ 20 ఏళ్ల యువకుడు పార్సిల్‌ తెచ్చినట్లుగా రికార్డయింది. మరో 20 రోజుల తర్వాత జడ్జి ఇంటికి మళ్లీ ఒక పార్సిల్‌ వచ్చింది. ‘రూ.20 లక్షలు సిద్ధంగా ఉంచు. సమయం, ప్రాంతం త్వరలోనే చెబుతా’అంటూ లేఖ ఉంది. బాధిత న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన కేసు నమోదు చేశారు. ఆగంతకుడిని గుర్తించామని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు