అదృశ్యమైన నాగరాజు దారుణహత్య 

28 Jan, 2021 08:25 IST|Sakshi

మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు

నరసరావుపేట రూరల్‌: ఇటీవల అదృశ్యమైన మాచర్ల నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘాల నాయకుడు కంచర్ల నాగరాజును పట్టణ సమీపంలోని పెదతురకపాలెం రోడ్డు గ్రావెల్‌ గుంటలలో దారుణంగా హతమార్చి దహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన నాగరాజు ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించటం లేదు. దీంతో కుటుంబసభ్యులు 21వ తేదీన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగా చివరి లోకేషన్‌ నరసరావుపేట, పరిసర ప్రాంతాలుగా  ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులతో పాటు కుటుంబసభ్యులు సైతం నాగరాజు ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో కాలిపోయిన మృతదేహన్ని పెదతురకపాలెం రోడ్డులో కుటుంబసభ్యులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మాచర్ల రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, వెల్దుర్తి ఎస్‌ఐ సుధీర్‌కుమార్, దుర్గి ఎస్‌ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని రూరల్‌ పోలీసుల సహకారం తీసుకున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతుడు నాగరాజే అని అతని కుటుంబసభ్యులు నిర్దారించడంతో పోలీసులు ఘటనా స్థలంలోనే శవపంచనామా, పోస్ట్‌మార్టం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ  నాగరాజుకు తురకపాలెంకు చెందిన ముస్లిం యువతితో ప్రేమ వివాహం అయిందని చెప్పారు. 2013 లో వివాహం అయిన మూడు నెలలకే ఆ యువతి మృతి చెందిందని తెలిపారు. ఆ కేసు 2017 వరకు కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు మృతదేహం ఇక్కడ లభించడంతో యువతి కుటుంబసభ్యులకు ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానం ఉందన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.  

ప్రణాళిక ప్రకారమే హత్య... 
వెల్దుర్తి: హత్య చేసేందుకు ముందే ప్రణాళిక చేసుకొని మధ్యవర్తిగా ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ద్వారా నాగరాజును  ఫంక్షన్‌ అని చెప్పి పిలిపించారని సమాచారం. ఫంక్షన్‌కు వెళ్లే సమయంలో వారు వెంబడించి పట్టుకొని అతనిని తీసుకెళ్లి హత్య చేశారని తెలిసింది. ఆనవాళ్లు కనబడకుండా నాగరాజు సెల్‌ను ఆ రహదారిలో వెళ్తున్న లారీలో విసిరివేశారు. కాగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాయవరం జంక్షన్‌ నుంచి నాగరాజు అంతిమయాత్రను నిర్వహించారు. 

బైక్‌ను కారు ఢీకొని మహిళ దుర్మరణం 
పెదకాకాని: జాతీయ రహదారిపై వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీ కొన్న ఘటనలో మహిళ దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెదకాకాని సమీపంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చేబ్రోలు కొత్త రెడ్డిపాలెంకు చెందిన గుంటూరు ప్రసాద్‌ నంబూరు అత్తగారింటికి వచ్చాడు. భార్య నిర్మల ఇద్దరు పిల్లలతో కలసి తిరిగి ఇంటికి బయలు దేరాడు. వారు ప్రయాణిస్తున్న  బైక్‌ జాతీయ రహదారిపై పెదకాకాని డక్కన్‌ టుబాకో కంపెనీ సమీపంలోకి చేరుకునే సరికి వెనుక నుంచి అతివేగంగా అజాగ్రత్తగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైవేలో బైక్‌పై వస్తున్న నలుగురు గ్రిల్స్‌ (రెయిలింగ్‌) దాటి సర్వీసు రోడ్డులో పడ్డారు.

ప్రసాద్, భార్య నిర్మల ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నిర్మల (45) మృతి చెందింది. వారిలో కుమార్తె పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఘటనా స్థలానికి పెదకాకాని సీఐ సిబ్బందితో చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్‌ చేబ్రోలు మండలం ప్రజాశక్తి విలేకరిగా పనిచేస్తున్నాడు. బైక్‌ను ఢీ కొన్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొంది. ప్రమాద సమయంలో కారులో బెలూన్‌లు ఓపెన్‌ కావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడి నుంచి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.    

మరిన్ని వార్తలు